కర్ణాటక సీఎం యడ్యూరప్పకు మళ్లీ పాజిటివ్‌.. ఆస్పత్రికి తరలింపు

16 Apr, 2021 15:41 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరు కోవిడ్‌ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు పొలిటికల్ లీడర్స్‌కు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కూడా చేరారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ‍్యూరప్ప మళ్లీ కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

నాకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. స్వల్పంగా జ్వరం ఉండ‌టంతో డాక్టర్ల సూచన మేరకు ఈ రోజు(శుక్రవారం) ఆసుపత్రిలో చేరాను. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నాకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చినందున ఇటీవ‌ల నన్ను క‌లిసిన పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు, అధికారులు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. అంద‌రూ సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉండాలి’ అని సూచించారు. అయితే బెంగ‌ళూరులోని రామయ్య ఆస్ప‌త్రిలో చేరిన సీఎంకు పాజిటివ్ రావ‌డంతో మ‌ణిపాల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా, య‌డ్యూర‌ప్ప‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డం ఇది రెండోసారి. గ‌త ఏడాది ఫ‌స్ట్ వేవ్ సంద‌ర్భంగా ఆయ‌న‌కు, తన కుమార్తె ప‌ద్మావ‌తి ఇద్ద‌రికీ క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

చదవండి: బెంగళూరులో శ్మశానాలన్నీ ఫుల్‌
బెంగళూరులో వైరస్‌ బీభత్సం.. ఒకేరోజు 10 వేల కేసులు

మరిన్ని వార్తలు