టీకా వేసుకుంటేనే మాల్స్‌లోకి.. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం

4 Dec, 2021 05:34 IST|Sakshi
బెంగళూరులోని ఒమిక్రాన్‌ సోకిన రోగి ఇంటి వద్ద కంటైన్‌మెంట్‌ జోన్‌ పోస్టర్‌ అంటించిన దృశ్యం

బెంగుళూరు/జైపూర్‌: కర్ణాటకలో ఒమిక్రాన్‌ కేసులు రెండు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మాల్స్, సినిమా హాల్స్, స్కూళ్లు, కాలేజీలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకోవాలి. కోవిడ్‌ సర్టిఫికెట్‌ చూపించాలి. 500 మంది కంటే ఎక్కువ మంది ఒకే కార్యక్రమానికి హాజరుకాకూడదని సర్కార్‌ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి బొమ్మై శుక్రవారం మంత్రులు, వైద్యనిపుణులు, ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి కఠినమైన నిబంధలు తీసుకురావాలని నిర్ణయించారు.

మరోవైపు, కర్ణాటకలో ఒమిక్రాన్‌ బారినపడ్డ వైద్యుడి భార్యకూ కరోనా సోకింది. ఆమె కంటి వైద్యురాలు. ఆమెకు సోకిన వేరియెంట్‌ను కనుగొనేందుకు శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపారు. దక్షిణాఫ్రికా నుంచి బెంగుళూరుకి వచ్చిన 10 మంది ప్రయాణికుల ఆచూకీ తెలియట్లేదని వార్తలొచ్చాయి. వారిని కనిపెట్టి కరోనా పరీక్షలు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చి ఒమిక్రాన్‌ సోకిన వృద్ధుడు ఐసోలేషన్‌ నుంచి మూడ్రోజులకే బయటికొచ్చి దుబాయ్‌కి అనుమతిలేకుండా వెళ్లిపోయాడు. దీనిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.  

ఒకే కుటుంబంలో తొమ్మిది మందికి
రాజస్తాన్‌లో జైపూర్‌లో ఒకే కుటుంబంలో తొమ్మిది మందికి కరోనా సోకింది. ఆ కుటుంబంలో నలుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారిని వెంటనే రాజస్తాన్‌  యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌కి తరలించారు. కుటుంబంలో 14 మందికి పరీక్షలు చేయగా తొమ్మిది మందికి పాజిటివ్‌గా తేలింది. యూకే, సింగపూర్‌ నుంచి తమిళనాడుకి వచ్చిన ముగ్గురు విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

మరిన్ని వార్తలు