ఫోర్త్‌ వేవ్‌లో అనవసర ఆంక్షలు ఉండవు

28 Apr, 2022 09:55 IST|Sakshi

బనశంకరి: కోవిడ్‌ నాలుగో దాడి పేరుతో అనవసరంగా ఎలాంటి ఆంక్షల్ని విధించరాదని, అవసరమైనంత వరకే నిబంధనలు ఉండాలని ప్రధాని మోదీ సూచించారు, ఆ మేరకు రాష్ట్రంలో చర్యలు తీసుకున్నామని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. బుధవారం నివాస కార్యాలయమైన కృష్ణాలో విలేకరులతో మాట్లాడారు. ప్రధానితో జరిగిన సీఎంల వీడియో సమావేశంలో రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితి గురించి చర్చించాను. రాష్ట్రంలో కోవిడ్‌ పూర్తిగా నియంత్రణలో ఉంది. ఈ నెల 9 తరువాత బెంగళూరులో పాజిటివ్‌ రేటు పెరిగింది అని చెప్పారు.

ప్రతిరోజు 30 వేల కోవిడ్‌ పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, సౌత్‌ కొరియా నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 వేలకు పైగా పడకలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షకు పైగా బెడ్లు అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్‌ను సిద్ధం చేశామన్నారు. 12 ఏళ్లలోపు పిల్లలకు  వ్యాక్సిన్‌ వేయడానికి కేంద్రం అనుమతించిందన్నారు. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని, అలాగే వసతులను పెంచాల్సి ఉందన్నారు.  

జూన్‌ మొదటివారం నుంచి కేసులు పెరగవచ్చు  
కరోనా కేసులు పెరిగితే లాక్‌డౌన్‌తో పాటు కొన్ని కఠిన నియమాలను తెస్తారనే వార్తలను ఆరోగ్య మంత్రి సుధాకర్‌ తిరస్కరించారు. జూన్‌ మొదటి వారంలో కోవిడ్‌ వేవ్‌ రావచ్చునని నిపుణులు తెలిపారు, ముందు జాగ్రత్తలు చేపట్టామన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌ వేస్తామని, 18 ఏళ్లు దాటినవారు వారికి రెండోడోస్‌ తీసుకున్న 9 నెలల తరువాత మూడో టీకాను వేసుకోవచ్చన్నారు. కోవిడ్‌ కాంట్రాక్టు వైద్య సిబ్బంది సేవలను 18 నెలల వరకు పొడించాలని ఆర్థికశాఖను కోరినట్లు తెలిపారు. 

నాలుగో వేవ్‌కు బీబీఎంపీ సిద్ధం
కోవిడ్‌ నాలుగో వేవ్‌ పంజా విసిరితే సమర్థంగా ఎదుర్కొనేందుకు బీబీఎంపీ సిద్ధమైంది. సిబ్బంది, ఆరోగ్యచికిత్స పరికరాలను సమకూర్చుకోవడంలో పాలికె అధికారులు నిమగ్నమయ్యారు. బెంగళూరులో నిత్యం  60 నుంచి 80 కేసులు వెలుగుచూస్తున్నాయి.  బెళందూరు, గసంద్ర, కోరమంగల, హెచ్‌ఎస్‌ఆర్‌.లేఔట్, వర్తూరు, హూడి, కాడుగోడితోపాటు మొత్తం 10 వార్డుల్లో కేసులు నమోదవుతున్నాయి. 

కోవిడ్‌ చికిత్సకు నాలుగు ఆసుపత్రుల్లో 1,365 సాధారణ పడకలు, ఐసీయు, వెంటిలేటర్‌ తో పాటు మొత్తం 2392 పడకలు సిద్ధం చేశారు. కరోనా వ్యాక్సిన్‌ రెండోడోస్‌ వేసుకోనివారి ఆచూకీ కనిపెట్టి పోలీసుల సాయంతో వారి ఇళ్ల వద్దకే వెళ్లి వ్యాక్సిన్‌ వేయా­లని యోచిస్తున్నారు.  60 ఏళ్లు లోపు వారికి బూస్టర్‌ డోస్‌ అందించడం పట్ల సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్‌ విరుచుకుపడితే అధికంగా నష్టపోయేది బెంగళూరేనని మూడుసార్లు స్పష్టమైంది.  

(చదవండి: ఫోర్త్‌ వేవ్‌ ముప్పు తప్పదంటున్న నిపుణులు..)

మరిన్ని వార్తలు