పక్క ప్రణాళికతోనే దాడి.. కఠినంగా శిక్షించాలి

12 Aug, 2020 19:59 IST|Sakshi

బెంగళూరు: ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఓ పోస్టు కర్ణాటకలో కల్లోలానికి దారి తీసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు ఒకరు ఓ వర్గాన్ని కించపరిచే విధంగా పోస్టు చేశారు. ఎమ్మెల్యే అండతోనే సదరు వ్యక్తి ఇలా చేస్తున్నాడని భావించి మంగ‌ళ‌వారం రాత్రి నిర‌స‌న‌కారులు బెంగళూరులో శ్రీనివాస మూర్తి నివాసంపై దాడి చేశారు. దీనిపై ఎమ్మెల్యే తాజాగా స్పందించారు. తాను బతికుండటం నిజంగా అద్భుతం అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ క్షణం నేను బతికి ఉండటం నిజంగా అద్భుతం. దాడి జరిగినప్పుడు నేను బయట ఉన్నాను. నా శ్రేయోభిలాషులు ఫోన్‌ చేసి దాడి గురించి ముందుగానే నన్ను హెచ్చరించారు. దాంతో తప్పించుకోగలిగాను. లేదంటే ఇప్పుడు నేను ఇలా బతికి ఉండేవాడిని కాదు’ అన్నారు శ్రీనివాస మూర్తి. (బెంగ‌ళూరు అల్ల‌ర్లు: ముస్లింల సాహ‌సం)

అంతేకాక ‘గుర్తు తెలియని వ్యక్తులు నా ఇంటికి నిప్పంటించారు. పెట్రోల్ బాంబులను విసిరారు. పోలీసులు సకాలంలో రాకపోతే నా ఇంట్లో​ గ్యాస్‌ సిలిండర్‌ను పేల్చేసేవారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి. పోలీసులు దీనిపై విచారణ చేయాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి’ అని శ్రీనివాస మూర్తి డిమాండ్ చేశారు. ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న తనకే ఇలా జరిగితే... ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. దాడులు చేసిన వారు తమ నియోజకవర్గానికి చెందిన వారు కాదని, బయటి వ్యక్తులన్నారు. ఈ విషయంపై హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని, తమ పార్టీ వారితో కూడా మాట్లాడినట్టు శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. 100మంది గాయపడ్డారు. వీరిలో 60 మంది పోలీసులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు