Karnataka Contractor Suicide.. చనిపోయేముందు స్నేహితులతో పార్టీ

17 Apr, 2022 07:27 IST|Sakshi
కాంట్రాక్టర్‌ పాటిల్‌ (ఫైల్‌), ఈశ్వరప్ప  

హోం స్టేలో 4 రోజులు ఉన్న కాంట్రాక్టరు సంతోష్‌ పాటిల్‌

బెంగళూరు: కాంట్రాక్టర్‌ సంతోష్‌పాటిల్‌ ఆత్మహత్య చేసుకోవడానికి పంటల తెగుళ్ల నివారణకు వాడే క్రిమిసంహారక మందు మోనోక్రోటోఫాస్‌ తాగినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. సంతోష్‌పాటిల్‌ చిక్కమగళూరు వద్ద కైమర అనే గ్రామంలో 4 రోజుల పాటు ఒక హోంస్టేలో మకాం వేశాడు. ఆ తరువాత ఉడుపిలో లాడ్జి గది తీసుకున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ముగ్గురు ఉన్నట్లు సమాచారం. హోం స్టేలో స్నేహితులతో కలిసి డ్యాన్స్‌ చేస్తూ హుషారుగా ఉన్నాడని, వెళ్లేటప్పుడు అక్కడ కుక్కలకు బిస్కెట్లు వేశాడని తెలిసింది. హోం స్టే, లాడ్జి వద్ద సీసీ కెమెరాల చిత్రాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన వెంట వచ్చిన ముగ్గురు ఎవరని ఆరా తీశారు.  

ఈశ్వరప్ప అరెస్ట్‌కు కాంగ్రెస్‌ ధర్నాలు..   
శివాజీనగర: కాంట్రాక్టర్‌ కేసులో మాజీ మంత్రి ఈశ్వరప్పను అరెస్టు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు శనివారం నుంచి వారంరోజుల ఆందోళన ప్రారంభించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల 9 బృందాలుగా ఏర్పడి వివిధ జిల్లా, తాలూకా కేంద్రాల్లో ధర్నాలు చేశారు. పాటిల్‌ కుటుంబానికి పరిహారం, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఈశ్వరప్పను అరెస్టు చేసి న్యాయవిచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ రామనగర జిల్లా వ్యాప్తిలో ధర్నా నిర్వహించారు.  

మంత్రిమండలి నుంచి తొలగింపు..  
కాంట్రాక్టర్‌ ఆత్మహత్య ఘటనతో మంత్రి పదవికి కే.ఎస్‌.ఈశ్వరప్ప రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన ఆ లేఖను సీఎం బొమ్మైకి ఇవ్వగా, అటు నుంచి గవర్నర్‌ గెహ్లాట్‌కు పంపారు. ఆ మేరకు ఈశ్వరప్పను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ గవర్నర్‌ ఆదేశాలిచ్చారు.  

మరిన్ని వార్తలు