డేంజర్‌ జోన్‌లో 6 జిల్లాలు

20 May, 2021 08:27 IST|Sakshi

బనశంకరి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినప్పటికీ పెద్ద ప్రయోజనం కనబడడం లేదు. దేశంలోని 52 జిల్లాలు డేంజర్‌జోన్‌లో ఉండగా అక్కడ 100 శాతానికి పైగా కేసుల వృద్ధి నమోదవుతోంది. వాటిలో కర్ణాటకలోని 6 జిల్లాలున్నాయి. ఏప్రిల్‌ 14 నుంచి ఇప్పటివరకు 52 జిల్లాల్లో విచ్చలవిడిగా కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. అందులో దేశంలోని మహానగరాలను వెనక్కినెట్టి రాష్ట్రంలోని 6 జిల్లాలు ముందువరుసలో నిలిచాయి.

కొడగుకు దేశంలోనే 3వ స్థానం..  
దేశంలో అత్యధిక కరోనా కేసుల వృద్ధి ఉన్న జిల్లాల్లో 3వ స్థానంలో రాష్ట్రంలోని కాఫీనాడు కొడగు జిల్లా ఉంది. కొడగు 184 శాతం కేసుల వృద్ధిరేటు కలిగి ఉంది. తుమకూరు 146 శాతం, కోలారు 136 శాతం, మండ్య 118 శాతం, రామనగర 102 శాతం, చామరాజనగర 143 శాతం వృద్ధి రేటు కలిగి ఉన్నాయి.  

ఇక్కడ ఫుల్‌ లాక్‌డౌన్‌ 
శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో, కలెక్టర్లతో తాజా సమావేశం తరువాత రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురువారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ మొదలైంది. కరోనా ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి ఇప్పటికే మే 24 వరకు సడలింపులతో లాక్‌డౌన్‌ జారీలో ఉంది. కేసులు తీవ్రం కావడంతో ఉమ్మడి బళ్లారి జిల్లా, హాసన్, కల్బుర్గి, కొప్పళ, శివమొగ్గ, చిక్కబళ్లాపుర జిల్లాల్లో 4 రోజుల పాటు కఠిన లాక్‌డౌన్‌ అమలు కాబోతోంది. ఈ సమయంలో కిరాణా షాపులు కూడా తెరవనివ్వరు.

మరిన్ని వార్తలు