శివాజీపై కర్ణాటక డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

1 Feb, 2021 12:21 IST|Sakshi

బెలగావి: ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కన్నడ వ్యక్తి అని కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్‌ కార్జోల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు సమస్యపై చాలా రోజులుగా మహా రాష్ట్ర, కర్ణాటక అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటగా బెల్గావ్, కార్వార్‌ కర్ణాటకలోనివి కాదని, మహారాష్ట్రవని సీఎం ఉద్ధవ్‌ఠాక్రే వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఆ వెంటనే ఆర్థిక రాజధాని ముం బై కర్ణాటకది అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ వివాదాన్ని మరింత పెద్దది చేశారు. దీంతో ఎన్సీపీ నేతలు రంగంలోకి దిగి లక్ష్మణ్‌పై విమర్శలు గుప్పించారు.  సుప్రీంకోర్టు తుది తీర్పువచ్చే వరకు కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్ర భూభాగంగా ప్రకటించాలని ఉద్ధవ్‌ ఇటీవల డిమాండ్‌ చేశారు. దీంతో కర్ణాటకకు చెందిన ఇద్దరు ఉప ముఖ్య మంత్రులు ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. 

కరువు వస్తే మహారాష్ట్రకు వచ్చారు.. 
ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ’కన్నడిగ’ అని డిప్యూటీ సీఎం గోవిద్‌ ఆరోపించారు. ఉద్ధవ్‌ ఠాక్రేకు చరిత్ర తెలియదని, శివాజీ పూర్వీకుడు బెల్లియప్ప కర్ణాటకలోని గడగ్‌ జిల్లా సోరటూర్‌కు చెందినవాడని పేర్కొన్నారు. గడగ్‌లో కరువు వచ్చినపుడు బెల్లియప్ప మహారాష్ట్రకు బయలుదేరాడని డిప్యూటీ సీఎం తెలిపారు. శివాజీ నాల్గవ తరానికి చెందిన వ్యక్తి అని గోవింద్‌ వ్యాఖ్యానించారు. శివసేన గుర్తుగా, పార్టీ పేరుగా పెట్టుకున్నది ఒక కన్నడ వ్యక్తి శివాజీది అని పేర్కొన్నారు. ఉద్ధవ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో గొడవలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి బెల్గావ్‌ సమస్యను లేవనెత్తాడని కార్జోల్‌ ఆరోపణలు గుప్పించారు.

మహారాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో విఫలమైందని ఉద్ధవ్‌  ప్రజాధరణ కోల్పోతున్నాడని మరో డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ ఆరోపించారు.  ముంబై కర్ణాటకలో భాగం కావాలని, లేదా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని లక్ష్మణ్‌ డిమాండ్‌చేశారు. స్వేచ్ఛ కోసం కిట్టూర్‌ రాణి చెన్నమ్మ బ్రిటిష్‌ వారిపై సాయుధ తిరుగుబాటుకు దారితీసిన భూమి బెల్గావి అని బెలగావి జిల్లాకు చెందిన మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శశికళ జోల్లె వ్యాఖ్యానించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు