‘అధికారంలోకి వచ్చాక.. నీ సంగతి చెప్తా’.. కర్ణాటక డీజీపీకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

15 Mar, 2023 17:05 IST|Sakshi

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటకలో నేతల మధ్య మాటల యుద్దాలు మొదలయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక డీజీపీ అధికార బీజేపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిజీపీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

డీకే శివకుమార్‌ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘ఈ డీజీపీ ‘నాలక్’ (పనికిరాని వాడు).. మన ప్రభుత్వం రానివ్వండి.. ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు’. ఇప్పటికే ఆయనని తొలగించాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ కూడా రాసింది. మొదట్లో డీజీపీ గౌరవనీయమైన వ్యక్తి అనుకున్నాను కానీ అతని తీరు చూస్తుంటే అలా అనిపించడం లేదన్నారు శివకుమార్‌. కాంగ్రెస్ నేతలపై పోలీసులు అనేక కేసులు నమోదు చేశారని, బీజేపీ నేతలపై ఒక్క కేసు కూడా లేదని, పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వీటన్నింటికి సమాధానం చెబుతామన్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వాన్ని కాపాడేందుకు అనైతికంగా పనిచేస్తున్న పోలీసు అధికారులందరిపైనా తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, తమ గ్రాండ్ ఓల్డ్ పార్టీ మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలదని డీకే శివకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు