Karnataka Covid Cases: ఒకే చోట 281 కేసులు.. లాక్‌డౌన్‌ విధిస్తారా?!

27 Nov, 2021 15:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటక ఎస్‌డీఎం మెడికల్‌ కాలేజీలో ‍​కరోనా కలకలం

281కి చేరిన కేసులు.. పరిసర ప్రాంతాల విద్యాసంస్థలకు సెలవులు

ప్రస్తుతం లాక్‌డౌన్‌ విధించే పరిస్థితుల్లో లేం: ఆరోగ్య శాఖ మంత్రి

బెంగళూరు: కొత్త రకం కరోనా వేరియంట్‌ బీ.1.1.529. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ‘ఒమిక్రాన్‌’గా పేరు పెట్టిన ఈ వేరియంట్‌.. గతంలో వెలుగు చూసిన డెల్టా, మిగతా వేరియంట్‌లకన్నా చాలా ప్రమాదకరం అని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా యూరప్‌ దేశాల్లో కేసుల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. మన దగ్గర కూడా కరోనా కేసుల్లో పెరుగదల కనిపిస్తోంది. 

గత రెండు మూడు రోజులుగా రెండు డోసులు తీసుకున్న మెడికల్‌ సిబ్బంది కరోనా బారిన పడ్డారనే వార్తలు చూశాం. ఈ క్రమంలో కర్ణాటక, ధార్వాడ్‌ మెడికల్‌ కాలేజీలో శనివారం 99 మంది మెడికల్‌ కాలేజీ స్టూడెంట్స్‌, అధ్యాపకులు కరోనా బారిన పడటంతో వీరి సంఖ్య 281కి చేరుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే. సుధాకర్‌ ఎస్‌డీఎం మెడికల్‌ సైన్స్‌ కాలేజీ కోవిడ్‌ క్లస్టర్‌గా మారిందని తెలిపారు. 
(చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్‌ఓ ఏమంటోంది?)

బారి ఎత్తున వైద్య విద్యార్థులు, అధ్యాపకులు కోవిడ్‌ బారిన పడటంతో.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై సుధాకర్‌ స్పందించారు. ‘‘ప్రస్తుతం కరోనా బారిన పడ్డ విద్యార్థులు, అధ్యాపకులు కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమానికి హాజరయ్యారని తెలిసింది. దాని వల్ల ఇన్ని కేసులు వెలుగు చూశాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించే పరిస్థితిలో లేము. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి’’ అని సుధాకర్‌ తెలిపారు.

ప్రస్తుతం మరో 1,822 పరీక్ష ఫలితాలు రావాల్సి ఉన్నందున ఈ సంఖ్య పెరగవచ్చని ధార్వాడ్ జిల్లా కలెక్టర్ నితీష్ పాటిల్ తెలిపారు. 281 మందిలో కేవలం ఆరుగురు రోగులకు మాత్రమే తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ఇతరుల్లో ఎలాంటి లక్షణాలు వెలుగు చూడలేదని తెలిపారు. ప్రస్తుతం వారందరినీ క్వారంటైన్‌ చేసి చికిత్స అందిస్తున్నామన్నారు.
(చదవండి: భారీ శబ్దం కలకలం : ‘భూకంపం సంభవించిందా ఏంటి’)

ప్రస్తుతం కరోనా బారిన పడ్డ వైద్య విద్యార్థులు, అధ్యాపకులు నవంబర్‌ 17న కాలేజ్‌ క్యాంపస్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిలో చాలా మందిలో అసలు లక్షణాలు కనిపించలేదు. పైగా అందరు వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం కాలేజీకి 500 మీటర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని విద్యాసంస్థలకు ఆదివారం వరకు సెలవు ప్రకటించారు. 

చదవండి: దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్‌

మరిన్ని వార్తలు