నా బావి కనిపిస్తలే.. కాస్త వెతికిపెట్టండి సారు

7 Jul, 2021 21:05 IST|Sakshi

బెంగళూరు (బెలగావి): ప్రభుత్వ అధికారుల చేతివాటం గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఉన్నది లేనట్లు, లేనిది ఉ​న్నట్లు సృష్టించగలరు. అలా ఏం చేశారో పాపం ఓ రైతు తన బావి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విచిత్ర ఘ‌ట‌న‌ క‌ర్ణాట‌క రాష్ట్రంలో చోటు చేసుకుంది. అసలు బావి కనిపించకపోవడం ఏంటి అనుకుంటున్నారా! అధికారులు సక్రమంగా పని చేసేంతవరకు ఇలాంటి విచిత్రాలే జరుగుతాయ్‌ మరి. 

వివ‌రాల్లోకి వెళితే.. బెళగావి జిల్లాలోని  మావినహొండ గ్రామంలో మ‌ల్ల‌ప్ప అనే రైతు తన పొలంలోని బావి కనిపించడం లేదని, ఎలాగైనా వెతికి పెట్టాలి సారు అంటూ రాయబాగ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ వింత ఫిర్యాదును చూసి పోలీసులు కూడా షాక్‌ అయ్యారు. బావి కనిపించకపోవడమేంటని రైతుని గట్టిగా నిలదీశారు కూడా. దీంతో ఆ రైతు ఈ ఫిర్యాదు వెనుక దాగున్న అస‌లు నిజం చెప్పాక పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు.

అసలు నిజం ఏమిటంటే..
మల్లప్ప పొలంలో ఎన్‌ఏఆర్‌ఈజీఏ పథకం కింద బావిని తవ్వినట్టు పంచాయతీ అధికారులు రికార్డులు సృష్టించారు. అదే క్రమంలో ఇందుకు రుణం రూపంలో రూ.77000 బిల్లును కూడా మంజూరు చేసి ప్రభుత్వ నిధులు కాజేశారు. ఇదిలా ఉండగా, ఇటీవల బావి తవ్వించినందుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ రైతుకు నోటీసులు కూడా పంపారు. దీనికి కారకులైన మహానుభావులకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని రైతు పోలీసులను ఆశ్రయించడంతో అధికారుల బాగోతం బయటపడింది. ప్ర‌స్తుతం దీని పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

మరిన్ని వార్తలు