చాక్లెట్‌ ఎంత పని చేసింది.. తల్లిదండ్రుల కళ్ల ముందే బాలిక మృతి

21 Jul, 2022 15:35 IST|Sakshi

యశవంతపుర(బెంగళూరు): ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ జరగాల్సిన ఘటనలను మనం మార్చలేము. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటుంటారు. అయినా ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాల బారిన పిల్లలు పడుతుంటారు. తాజాగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్‌ ఓ బాలిక మృత్యు ఒడిలోకి చేర్చింది. ఈ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బైందూరు తాలూకా బవళాడిలో సమన్వి (6) అనే బాలికను చాక్లెట్‌ కవర్‌ ప్రాణం తీసింది.

సమన్వి ఆంగ్ల పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం పాఠశాల బస్‌ ఎక్కడానికి నోట్లో చాక్లెట్‌ పెట్టుకుని పరుగులు తీసింది. ఆ తొందరలో కవర్‌ తీయకుండానే చాక్లెట్‌ మింగడంతో గొంతుకు అడ్డం పడింది. ఊపిరి ఆడక బస్‌లో స్పృహ తప్పిపడిపోయింది. బాలిక తల్లిదండ్రులు, బస్‌ డ్రైవర్‌ బైందూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పాప చనిపోయింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు కళ్ల ముందే తమ కూతురు మరణించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.

చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బైక్‌పై నుంచి ఎగిరిపడి బస్సు వెనుక టైర్‌ కింద..

మరిన్ని వార్తలు