సార్‌! మా అమ్మ ఫోన్‌ కనిపెట్టండి.. ప్లీజ్‌..

23 May, 2021 18:33 IST|Sakshi
ఫిర్యాదు లేఖను చూపెడుతున్న హిృతీక్ష

బెంగళూరు : కరోనా వైరస్‌ మహమ్మారి ఎన్నో కుటుంబాలను చెల్లా చెదురు చేసింది. బంధాలను తెంచి, దిగమింగలేని విషాదాలను మిగిల్చింది. అయిన వాళ్లను కోల్పోయి, వారి జ్ఞాపకాలతో భారంగా కాలం వెల్లదీస్తున్న వారు కొందరైతే.. ఆ జ్ఞాపకాలను పథిలం చేసుకోవాలని పరితపిస్తున్న వారు మరికొందరు. కర్ణాటకకు చెందిన ఆ చిన్నారి కూడా కరోనాతో చనిపోయిన తల్లి జ్ఞాపకాలను పథిలం చేసుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు కన్నీటి లేఖను రాసింది...

వివరాలు.. కర్ణాటకలోని కొడగుకు చెందిన తొమ్మిదేళ్ల హిృతీక్ష తల్లి కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందింది. ఆ చిన్నారికి కడసారి చూపుకూడా దక్కలేదు. అయితే, తల్లి జ్ఞాపకాలు నిండిఉన్న ఫోన్‌నైనా దక్కించుకుందామనుకుంది. ఆసుపత్రికి ఫోన్‌ చేయగా.. ఫోన్‌ కనిపించటం లేదని జవాబొచ్చింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన హిృతీక్ష కొడగు పోలీసులను ఆశ్రయించింది. తన తల్లి జ్ఞాపకాలు నిండిఉన్న ఫోన్‌ను కనిపెట్టండంటూ భావోద్వేగపూరిత ఫిర్యాదు లేఖను వారికి అందించింది. ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఫోన్‌ కోసం అన్వేషణ ప్రారంభించారు. 

ఈ ఘటనపై హిృతీక్ష బంధువు ఒకరు మాట్లాడుతూ.. ‘‘ పాప తల్లి ఆసుపత్రిలో ఉండగా మేము ఫోన్‌ చేశాము. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. మరుసటి రోజు ఆమె చనిపోయిందని మాకు కబురందింది. మేము ఆమె ఫోన్‌ కావాలని అడిగాము. అయితే, ఫోన్‌ కనిపించటం లేదని చెప్పారు. ఆ ఫోన్‌ కావాలని అప్పటినుంచి పాప ఏడుస్తూనే ఉంది. అందులో చనిపోయిన తల్లికి సంబంధించిన చాలా ఫొటోలు ఉన్నాయంట’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు