కొత్త నిబంధనలతో పెళ్లిళ్ళు సాధ్యమయ్యేనా?

1 Mar, 2021 06:30 IST|Sakshi

కోవిడ్‌ నెగిటివ్‌ వస్తేనే కేరళవాసులకు అనుమతి

కర్ణాటక సరిహద్దుల్లో సందిగ్ధం   

సాక్షి, బెంగళూరు: కేరళ నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు చూపించాలి, లేదంటే వారిని వెనక్కి పంపిస్తారు. ఈ నిబంధనలు కాబోయే దంపతులకు చుక్కలు చూపిస్తున్నాయి. వధువు కర్ణాటక, వరుడు కేరళ, వివాహం కొడగు జిల్లా మడికేరిలో అయితే, వరుడు సహా వందలాది మంది బంధుమిత్రులు కరోనా నెగిటివ్‌ రిపోర్టు చూపించడం సాధ్యమేనా అని కేరళీయులు నిట్టూరుస్తున్నారు.

కొత్త నిబంధనలతో కష్టం..  
కేరళ, మహారాష్ట్రలో కరోనా మళ్లీ పెరగడంతో అక్కడి నుంచి వచ్చే వారికి కొత్త నిబంధనను కర్ణాటక అమలు చేస్తోంది. కరోనా పరీక్ష నెగిటివ్‌ రిపోర్టు చూపిస్తేనే ఈ ఇరురాష్ట్రాల వారిని అనుమతిస్తారు. దీంతో చాలా మందికి ఇక్కట్లను తెచ్చిపెడుతోంది.

సుమతి– ప్రమోద్‌ల పెళ్లికి ఆటంకం 
కొడగు జిల్లా మడికేరిలోని కడగదాళు గ్రామానికి చెందిన సుమతి అనే అమ్మాయి పెళ్లి కేరళలోని కాసరగోడు జిల్లాకు చెందిన ప్రమోద్‌ నాయర్‌తో నిశ్చయమైంది. మడికెరిలోని ఓంకారేశ్వర దేవాలయంలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికొడుకు బృందంవారు కరోనా నెగిటివ్‌ రిపోర్టు తీసుకురావాల్సి రావడంతో సమస్య వచ్చి పడింది. అంతమందీ కరోనా పరీక్షలు జరిపించాలంటే సాధ్యమయ్యే పని కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ పరీక్షలు చేయించుకున్నా 72 గంటల వరకు రిపోర్టులు రావని బంధువులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో సోమవారం వివాహం నాటికి కరోనా పరీక్షల ఫలితాలు రావడం ఆలస్యమవుతుందని చెబుతున్నారు. కుటుంబ సభ్యులే హాజరైతే 10–15 మంది ఉంటారని, వారికి ప్రైవేటు ఆస్పత్రిలో టెస్టులు చేయిస్తే కనీసం రూ. 25 వేలైనా ఖర్చు అవుతుందని తెలిపారు. కూలీనాలీ చేసి కూతురు పెళ్లి చేస్తున్న తమలాంటి సామాన్యులకు అంతటి భారం మోయడం కుదరని చెప్పారు. తమ బాధను అర్థం చేసుకుని పెళ్లికైనా నిబంధనలను సడలించాలని వేడుకున్నారు. కేరళ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటువంటి ఉదంతాలు మరెన్నో ఉన్నాయి.
చదవండి:
కరోనా విజృంభణ.. రెండు వారాలపాటు లాక్‌డౌన్‌   
ప్రాంక్‌ అంటూ 300 అశ్లీల వీడియోలు..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు