లాక్‌డౌన్‌ ఎత్తివేతకు అడుగులు వేస్తున్న ప్రభుత్వం

1 Jun, 2021 08:51 IST|Sakshi

లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం

7 నుంచి దశలవారీగా సడలింపులు

సర్కారు మదిలో యోచన

బనశంకరి: రాష్ట్రంలో వారం నుంచి కోవిడ్‌–19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం అన్‌లాక్‌ గురించి యోచిస్తోంది. రెండో దశ కోవిడ్‌ వికటాట్టహాసం చేసి భారీగా ప్రాణాలను బలిగొంటున్న తరుణంలో మే 10 నుంచి రెండో లాక్‌డౌన్‌ ఆరంభమైంది. జూన్‌ 7 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. ఒకనెల రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోగా కరోనా మెల్లగా అదుపులోకి వస్తోంది. బెంగళూరు కూడా కరోనా పీడ నుంచి కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం అన్‌లాక్‌కు సన్నాహాలు చేస్తోంది. దిగ్బంధం వల్ల పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడింది. దీంతో అన్‌లాక్‌ చేయడం యడియూరప్ప సర్కారుకు అనివార్యమైంది. జూన్‌ 7 నుంచి దశలవారీగా దిగ్బంధాన్ని సడలించి ఆర్థిక కార్యకలాపాలకు పచ్చజెండా ఊపడం తప్ప గత్యంతరం లేదని ఆర్థికశాఖ అధికారులు సర్కారుకు సూచించారు.

పొడిగించాలని కమిటీ నివేదిక  
జూన్‌ 7వ తేదీ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయాలి అనే అంశాలతో కోవిడ్‌ సాంకేతిక సలహా కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికను అందించింది. లాక్‌డౌన్‌ కొనసాగించాలా వద్దా, కొనసాగిస్తే ఎన్నిరోజులు, అన్‌లాక్‌ ఎలా ఉండాలి తదితర అంశాలను పేర్కొంది. ఈ నివేదిక ను ఆరోగ్య మంత్రి సుధాకర్‌కు సమితి అందజేసింది. నివేదికను కృష్ణాలో సీఎం యడియూరప్పకు ఆయన అందజేశారు. మరో 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగించాలని సమితి నివేదికలో సిఫార్సు చేసింది. దీని గురించి ఇరువురూ చర్చించారు. జూన్‌ 4, 5 తేదీల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయిస్తామని సీఎం తెలిపారు.

2-3 వేలకు తగ్గినప్పుడే: అశోక్‌  
కోవిడ్‌ సలహాసమితి నివేదిక ఆధారంగా లాక్‌డౌన్‌ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ తెలిపారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ కేసుల సంఖ్య ఆధారంగా తీర్మానం చేస్తామని అన్నారు. బెంగళూరులో నిత్యం 500 కంటే తక్కువ కోవిడ్‌ కేసులు నమోదు కావాలి, రాష్ట్రంలో  వెయ్యి, మూడు వేల కేసుల స్థాయికి తగ్గినప్పుడే లాక్‌డౌన్‌ సడలింపుపై నిర్ణయానికి వస్తామన్నారు. దొడ్డబళ్లాపుర వద్ద అత్యాధునిక వసతులతో కోవిడ్‌ తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించామని, ఇందులో 100 పడకలు ఉంటాయని, ఐసీయూ, వెంటిలేటర్‌ వసతి ఉందని తెలిపారు. 

మరిన్ని వార్తలు