పేదలకు ప్రతి నెలా రూ.2,000.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన.. ప్రియాంకకు పోటీగా..

19 Jan, 2023 14:01 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.2,000 సాయంగా అందించనున్నట్లు చెప్పారు. దారిద్య్ర  రేఖకు దిగువన ఉన్నవారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రకటిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు సీఎం బసవరాజ్ బొమ్మై వివరిస్తారన్నారు. ఈ ఏడాది జులై నుంచే పథకం అమలు చేస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఇలాంటి పథకమే ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కుటుంబపెద్దగా ఉండే మహిళకు ప్రతినెల రూ.2,000ల చొప్పున సంవత్సరానికి రూ.24,000 ఇస్తామని చెప్పారు. ఆ మరునాడే అధికార పార్టీ మంత్రి పేదలకు రూ.2,000 పథకం ప్రకటించడం గమనార్హం.

75 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు మంత్రి అశోక. కర్ణాటకలో మరోమారు తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి..

మరిన్ని వార్తలు