హలాల్‌ V/s జట్కా.. మాంసం అమ్మకాల్లో కొత్త ట్రెండ్‌

4 Apr, 2022 18:50 IST|Sakshi
ఆదివారం ఉదయం మైసూరులో కుప్ప మాంసం కొంటున్న ప్రజలు

సాక్షి, బెంగళూరు: హలాల్‌ కట్‌ వివాదం నేపథ్యంలో ఉగాది సందర్భంగా జట్కా కట్‌ మాంసం వ్యాపారం జోరుగా జరిగింది. ఆదివారం నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అంతటా మాంసం దుకాణాల వద్ద జనం క్యూ కట్టారు. హిందూ సంఘాలు హలాల్‌ కట్‌ పట్ల గత కొద్దిరోజులుగా వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలాచోట్ల హలాల్‌ కట్‌ మాంసం విక్రయాలు తగ్గినట్లు సమాచారం.  దొడ్డ తాలూకాలో జట్కాకట్, గ్రామీణ ప్రాంతాల్లో కుప్ప మాంసానికి డిమాండు ఎక్కువైంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ హిందువులు జట్కా కట్‌ కోసం ఎగబడ్డారు. దేవనహళ్లి, రామనగర జిల్లాలో కూడా హలాల్‌ కట్‌ మాంసం దుకాణాలకు వ్యాపారం తగ్గిందని సమాచారం. 

ఆరా తీసి కొనుగోళ్లు  
అనేక చోట్ల మాంసం దుకాణాల ముందు హలాల్, జట్కా మాటలు వినిపించాయి. నగర, గ్రామీణ ప్రాంతాల్లో మాంసం దుకాణాల్లో ఎక్కువగా జట్కా  మాంసం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. బెంగళూరు నగరంలో మైసూరురోడ్డు, యశవంతపుర రోడ్డు, కోరమంగల, కంఠీరవ స్టేడియం సమీపంతో పాటు నగరంలో చాలాచోట్ల హలాల్‌ కట్‌ మాంసం దుకాణాలవద్ద రద్దీ తక్కువగా కనిపించింది. కొన్ని మాంసం దుకాణాల్లో హలాల్‌ కట్‌ , జట్కా కట్‌ అని బోర్డులు పెట్టి విక్రయించారు. నగరంలో మైసూరు రోడ్డులోని పాపణ్ణ మటల్‌ స్టాల్‌లో మాంసం వ్యాపారం జోరుగా జరిగింది. చాలా చోట్ల కుప్పలు వేసి విక్రయించిన మాంసం కోసం ప్రజలు ఎగబడ్డారు. స్థానికులే జీవాలను కోసి విక్రయించారు. తక్కువ ధరకు ఈ మాంసం అమ్మడంతో కొనడానికి ఎగబడ్డారు. 

ఏ పద్ధతైనా ఓకే: మంత్రి ఈశ్వరప్ప 
హలాల్‌– జట్కా వివాదాన్ని కొందరు వ్యక్తులు, పార్టీలు సృష్టించారు, ప్రజలు దీని ఫలితాన్ని అనుభవిస్తున్నారని మంత్రి కేఎస్‌.ఈశ్వరప్ప అన్నారు. ఆదివారం కార్కళలో మాట్లాడుతూ ముస్లింలు హలాల్‌ చేయాలంటే చేయనీయండి, హిందూవులు జట్కా  చేయాలంటే చేయనివ్వండి అని చెప్పారు. ఈ విషయం సమాజంలో విషబీజాలు నాటే కుతంత్రం జరుగుతోందన్నారు. 

మరిన్ని వార్తలు