అసెంబ్లీ ఎన్నికల వేళ.. డీకే శివకుమార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

21 Apr, 2023 11:47 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌(కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శివకుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు సీబీఐ విచారణను రద్దు చేయాలని కోరుతూ శివకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను  జస్టిస్‌ నటరాజన్‌ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. 

శివకుమార్ ఆస్తులు కర్ణాటక వెలుపల ఉన్నందున ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు దర్యాప్తు చేసేందుకు సెప్టెంబర్ 25, 2019న రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చిందని కోర్టు తెలిపింది. అయితే తనను ఏ దర్యాప్తు సంస్థ విచారించాలో ఎన్నుకునే లేదా తెలిసే హక్కు నిందితుడికి(శివకుమార్‌) లేదని, చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం విచారణకు అనుమతించేటప్పుడు కారణాలను చెప్పాల్సిన అవసరం లేదని సీబీఐ కోర్టులో వాదించింది.
చదవండి: Karnataka Election: సమరానికి సై.. నేడు అమిత్‌ షా.. 29న మోదీ!

సీబీఐ కేసు నమోదు
కాగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై 2017లో శివకుమార్‌కు చెందిన పలు ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోదాలు నిర్వహించింది. ఐటీ సోదాల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తును ప్రారంభించింది. 2019లో డీఎస్‌ యడియూరప్ప ప్రభుత్వం శివకుమార్‌పై దర్యాప్తునకు అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో 2020 అక్టోబర్‌లో అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ చట్టవిరుద్ధమని, తనపై విచారణను రద్దు చేయాలని కోరుతూ శివకుమార్ 2022 జూలై 28న హైకోర్టును ఆశ్రయించారు.

విచారణ అవసరం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనను ఇబ్బంది పెట్టేందుకు సీబీఐ ఉద్దేశపూర్వకంగానే మళ్లీ మళ్లీ నోటీసులు పంపుతుందని శివకుమార్‌ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్‌ నేతపై సీబీఐ విచారణకు హైకోర్టు పలుమార్లు స్టేలు విధించింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసులో భారీ బినామీ లావాదేవీలు ఉండటం వల్ల అంతరాష్ట్ర విచారణ అవసరమని అభిప్రాయపడింది.  ఈ మేరకు శివకుమార్‌  పిటిషన్‌ను కొట్టి వేసింది.

అసెంబ్లీ ఎన్నికల వేళ ఎదురుదెబ్బ
మే 10న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న శివకుమార్‌కు హైకోర్టు తీర్పు ఎదురుదెబ్బగా కనిపిస్తోంది. కాగా రాబోయే ఎన్నికల్లో రామనగర జిల్లాలోని కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఎలక్షన్‌ కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, అతని, తన కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ. 1,414 కోట్లుగా ఉంది. 

మరిన్ని వార్తలు