పెళ్లికాని తల్లిదండ్రులు ఉంటారు గానీ, అక్రమ సంతానం ఉండదు: హైకోర్టు

16 Jul, 2021 12:08 IST|Sakshi

బెంగళూరు: అనైతిక బంధంతో పిల్లలకు జన్మనిచ్చేవారు ఉంటారేమోగానీ, అక్రమ సంతానం మాత్రం ఉండదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. తమ పుట్టుక ఎలా సంభవిస్తుందన్న విషయంతో పిల్లలకు ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొంది. బెంగళూరు ఎలక్ట్రిసిటి సప్లై కంపెనీ(బీఈఎస్‌సీఓఎమ్‌)లో ఉద్యోగం నిమిత్తం ఓ వ్యక్తి దాఖలు పిటిషన్‌పై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. వివరాలు... బీఈఎస్‌సీఓఎమ్‌లో పనిచేసే ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం మరణించారు. 

ఈ క్రమంలో 2014లో ఆయన కుమారుడు కె. సంతోష కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వాల్సిందిగా సంస్థకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, సంతోష తన తండ్రికి రెండో భార్య ద్వారా జన్మించిన సంతానం. అది కూడా మొదటి భార్య ఉండగానే, తన తల్లిని తండ్రి వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తమ నిబంధనల ప్రకారం, సంతోష అర్జీని బీఈఎస్‌సీఓఎమ్‌ తిరస్కరించింది. దీంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. సింగిల్‌ బెంచ్‌ సంతోష పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ క్రమంలో తాజాగా అతడి అభ్యర్థనపై విచారణ చేపట్టిన జస్టిస్‌ బీవీ నాగరత్న, హంచాటె సంజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం సంతోషకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా... ‘‘తల్లి, తండ్రి లేకుండా ఈ ప్రపంచంలో ఏ బిడ్డ జన్మించదు. అదే విధంగా పుట్టుకలో తన ప్రమేయం కూడా ఉండదు. కాబట్టి అనైతికంగా తల్లిదండ్రులుగా మారిన వారు ఉంటారేమో గానీ, అక్రమ సంతానం అనేది ఉండదు. ఈ కేసుకు సంబంధించి, వ్యక్తిగత చట్టాలను అనుసరించి.. అక్రమ సంతానం అనే పదం లేదు. 

అదే విధంగా.. హిందూ వివాహ చట్టం-1954 ప్రకారం చట్టబద్ధ, చట్టవిరుద్ధ పెళ్లిళ్ల ద్వారా జన్మించిన సంతానానికి సమాన హక్కులు అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నియామకం విషయమై పునరాలోచన చేయాలని ఆదేశిస్తున్నాం’’ అని పేర్కొంది. అదే విధంగా.. కారుణ్య నియామకాలకు.. ఒక ఉద్యోగి మొదటి పెళ్లి రద్దు కాకుండానే, రెండో భార్య లేదా రెండో వివాహం ద్వారా జన్మించిన సంతానం అర్హులు కాలేరంటూ బీఈఎస్‌సీఓఎమ్‌ 2011, సెప్టెంబరు 23న జారీ చేసిన సర్కులర్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు