వాళ్లు గుంపుల్లో తిరగొద్దు.. కర్ణాటక ఆరోగ్య మంత్రి హెచ్చరిక.. కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందే..!

6 Mar, 2023 15:40 IST|Sakshi

బెంగళూరు: దేశంలో కరోనా కొత్త కేసుల్లో మళ్లీ పెరుగుదల కన్పిస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్‌-19 జాగ్రత్తలపై ప్రజలను అలర్ట్‌  చేసింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్లు పైడినవారు,  పిల్లలు, గర్భణీలు గుంపుల్లో తిరగకూడదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ హెచ్చరించారు. వీరు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అలాగే ఆస్పత్రుల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది మొత్తం కచ్చితంగా మాస్కులు ధరించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. అయితే కరోనా పరిస్థితి ప్రస్తుతం ప్రమాదకరంగా ఏమీ లేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా నిపుణుల కమిటీతో సమావేశమై పరిస్థితిపై సమీక్షించినట్లు పేర్కొన్నారు.

వేసవికాలం సమీపించిన నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్‌పైనా సమీక్షించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలు రోజుకు రూ.2-3 లీటర్ల నీటిని తీసుకొని హైడ్రేట్‌గా ఉండాలని సూచించారు. నీటితో పాటు మజ్జిక, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి వాటిని తీసుకోవాలన్నారు.

భారత్‌లో కరోనా కేసులు తగ్గి చాలా రోజులవుతున్నప్పటికీ ఈ మధ్య మళ్లీ కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కన్పిస్తోంది. మార్చి 5న 281 మంది, మార్చి 4న 324 మంది వైరస్ బారినపడ్డారు. అలాగే Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్‌) కేసులు వెలుగుచూస్తున్నాయి. అనేక మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో బాధపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్  కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్తఫ్లూ కరోనా లాంటిది కాకపోయినప్పటికీ జాగ్రత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కర్ణాటక ఆరోగ్యమంత్రి కూడా కరోనా విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
చదవండి: కొత్త ఫ్లూ ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్‌

మరిన్ని వార్తలు