Karnataka Heavy Rains: ఇదేందయ్యా.. నెల వర్షం ఒక్క రోజులోనే!

20 May, 2022 08:20 IST|Sakshi
ఎన్నాళ్లిలా ఉండాలి.. సీఎంకు కష్టాలు చెప్పుకుంటున్న మహిళలు

బెంగళూరులో ఒక్కరోజులో 10 సెంటీమీటర్లకు పైగా వాన  

ఇంకా ముంపులోనే అనేక ప్రాంతాలు  

రెండవ రోజూ సీఎం సందర్శన  

బనశంకరి(బెంగళూరు): బెంగళూరులో మంగళవారం ఈ శతాబ్దంలోనే కురిసిన భారీ వర్షంగా చరిత్రకెక్కింది. గత 113 ఏళ్లలో మే నెలలో ఒకేరోజు కురిసిన అత్యధిక వాన ఇదే. అంతేకాదు ఇది బెంగళూరు నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షం. 1909 మే 6వ తేదీన 15.39 సెంటీమీటర్ల కుండపోత కుమ్మరించింది.  ఈ మంగళవారం 11.46 సెంటీమీటర్లు వర్షం కురిసిందని వాతావరణ శాఖ కేంద్రం నమోదు చేసింది. సాధారణంగా మే నెలలో బెంగళూరులో సగటు వర్షపాతం 10.74 సెంటీమీటర్లు కాగా,  మంగళవారం రాత్రి ఒక్కరోజులోనే ఆ వర్షం కురిసింది.


గురువారం కూడా ముంపులోనే ఉన్న బెంగళూరులోని హొరమావు ప్రాంతం 

దీంతో గురువారంనాటికి కూడా అనేక ప్రాంతాలు ముంపులోనే మగ్గుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకు రావడానికి మార్గం లేదు. ఇళ్లు, అపార్టుమెంట్ల చుట్టూ వాననీరు, బురద మేటవేసింది. ఇలాగే కొనసాగితే ప్రమాదకర అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాలతో తలెత్తే ప్రమాదాలను తప్పించడానికి సుమారు రూ.1600 కోట్లతో బెంగళూరులోని కాలువలను అభివృద్ధి చేస్తామని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. గురువారం నగరంలో వర్ష బాధిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. డ్రైనేజీలు, భూగర్భ డ్రైనేజీలను మరమ్మతు చేసి వాననీరు సజావుగా వెళ్లేలా చేస్తామన్నారు.

ఒకేసారి ఇంత భారీ వర్షం రావడంతో ఇళ్లలోకి చొరబడి ఇబ్బందులు సృష్టించిందన్నారు. ఇళ్లలోకి నీరుచేరి నష్టపోయిన వారికి రూ.25 వేలు పరిహారం అందిస్తాం, ఒకవారం పాటు ఆహారం అందిస్తామని తెలిపారు. నిర్ణీత అవధిలోగా నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. నగరోత్థాన పథకం, స్మార్ట్‌సిటీ పనుల్లో ఆలస్యం వద్దని ఆదేశించారు. పదేపదే పనులు ఆలస్యం చేయడంతో  ప్రభుత్వానికి ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని అసమాధానం వ్యక్తం చేశారు.  

సీఎం ముందు జనాగ్రహం  
జేసీ నగర లేఔట్‌లో పలువురు మహిళల వర్ష కష్టాలపై సీఎంకు ఏకరువు పెట్టారు. అక్కడ నుంచి కమలానగర మెయిన్‌రోడ్డు, శంకరమఠ దేవస్దాన, హెచ్‌ఆర్‌బీఆర్‌ లేఔట్‌ తదితర ప్రాంతాల్లో బస్సులో పర్యటించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నగరంలో గత మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ముంపుప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం చేరినప్పటికీ అధికారులు సహాయక చర్యలు చేపట్టలేదని బాధిత ప్రజలు సీఎం ముందు ఆక్రోశం వెళ్లగక్కారు, తాగునీరు, విద్యుత్‌ లేవు, తినడానికి ఆహారం కూడా లేదు, అధికారులెవరూ మా వద్దకు వచ్చి పట్టించుకున్న పాపాన పోలేదని మహిళలు మండిపడ్డారు. మేము పాలికెకు పన్నులు చెల్లించడం లేదా, ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. బాధితులను సీఎం సమాధానపరిచారు.

చదవండి: Viral Video: రోడ్డుపైనే జుట్టు పట్టుకొని తన్నుకున్న విద్యార్థినిలు

మరిన్ని వార్తలు