ప్రేమకు తలొగ్గిన కోర్టు..  లవర్‌ను పెళ్లి చేసుకునేందుకు హత్య కేసు దోషికి15 రోజుల పెరోల్‌..

4 Apr, 2023 16:25 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక హైకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఓ హత్య కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి.. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రేమికుల మనసును గెలుచుకున్నాయి.

'ఇతడ్ని విడుదల చేడయం అనివార్యం. లేకపోతే జీవితాంతం ప్రేమను కోల్పోతాడు. జైలులో ఉన్న ఇతడు.. తన ప్రేయసి వేరే వాళ్లను పెళ్లి చేసుకుందని తెలిస్తే భరించలేడు. అందుకే ఎమర్జెన్సీ పెరోల్ వినతికి అంగీకరిస్తున్నాం.' అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ప్రేయసిని పెళ్లాడేందుకు పెరోల్ పొందిన ఇతని పేరు ఆనంద్. ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో యావజ్జీవ శిక్ష పడింది. అయితే అతని సత్ప్రవర్తన కారణంగా శిక్షను 10 ఏళ్లకు తగ్గించారు. ఇప్పటికే ఆరేళ్ల శిక్షాకాలం పూర్తయింది. ఇంకో 4 ఏళ్లు జైలులో ఉండాల్సి ఉంది.

అయితే నీతా అనే యువతి, ఆనంద్ 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇతను జైలులో ఉండటంతో పెళ్లి చేసుకోలేకపోయారు. దీంతో తనకు వేరే వాళ్లతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు చూస్తున్నారని, ఆనంద్‍కు పెరోల్ మంజూరు చేస్తే అతడ్నే పెళ్లి చేసుకుంటానని నీతా కోర్టును ఆశ్రయించింది. ఆనంద్ తల్లి కూడా ఈమెకు మద్దతుగా నిలిచింది. ఈ ప్రేమ గురించి తెలుసుకున్న న్యాయస్థానం.. ఇద్దరు ఒక్కటి కావాలని పెరోల్‌ మంజూరు చేసింది.

దీంతో ఏప్రిల్ 5న ఆనంద్ జైలు నుంచి విడుదల కానున్నాడు. మల్లీ 20వ తేదీ సాయంత్రం తిరిగి జైలుకు చేరుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేయాలనే నిబంధన లేకపోయినప్పటికీ ఇది అసాధారణ పరిస్థితి అని భావించి కోర్టు ఈ తీర్పునిచ్చింది.
చదవండి: మద్యం నిషేధించాలని వినతి..బీజేపీ ఎమ్మెల్యే సమాధానం విని బిత్తరపోయిన మహిళ

మరిన్ని వార్తలు