Karnataka Hijab Controversy: హిజాబ్‌ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ.. కన్నడనాట అలర్ట్‌

14 Mar, 2022 20:28 IST|Sakshi

బెంగళూరు: హిజాబ్‌  వ్యవహారం.. ప్రధానంగా కర్ణాటకను ఆపై దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించిన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అంతా ఎదురు చూస్తున్న కర్ణాటక హైకోర్టు తీర్పు రేపు(మార్చి 15న) వెలువడనుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

హిజాబ్‌ అభ్యంతరాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై 11 రోజులపాటు సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు బెంచ్‌.. తీర్పును ఫిబ్రవరి 25వ తేదీన రిజర్వ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. మార్చి 15న మంగళవారం ఉదయం 10గం.30ని. తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం. ఇక ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌లో కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రీతూ రాజ్‌ అవస్థి కూడా ఉన్నారు. తీర్పు నేపథ్యంలో కన్నడనాట పోలీసులు అలర్ట్‌ అయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. 

హిజాబ్‌ దుమారం.. 
ఈ ఏడాది జనవరి 1వ తేదీన ఉడుపికి చెందిన ప్రభుత్వ కళాశాలలో.. హిజాబ్‌ ధరించిన ఆరుగురు విద్యార్థులను  సిబ్బంది లోనికి అనుమతించలేదు. కళాశాల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాళ్లను అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి హిజాబ్‌ వ్యవహారం మొదలైంది. 

ఈ విషయంలో విజ్ఞప్తులను సైతం కళాశాల ప్రిన్సిపాల్‌ రుద్రే గౌడ తోసిపుచ్చారు. అంతేకాదు.. తల మీద గుడ్డతో క్యాంపస్‌లోకి అనుమతించినా.. తరగతి గదిలోకి మాత్రం అనుమతించలేదు. దీంతో ముస్లిం విద్యార్థినిలు హిజాబ్‌లతో విద్యాసంస్థల దగ్గర నిరసన ప్రదర్శనలు వ్యక్తం చేశారు. ఆపై ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వాన అయ్యింది. హిజాబ్‌ అభ్యంతరాలు.. పోటీగా కాషాయపు కండువాతో స్టూడెంట్స్‌ ర్యాలీలు నిర్వహించేదాకా చేరుకుంది. వాళ్లను అనుమతిస్తే.. మమ్మల్ని అనుమతించాలంటూ హిందూ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆపై హిజాబ్‌ అభ్యంతరాలు.. కర్ణాటక నుంచి దేశంలోని మరికొన్ని చోట్లకు విస్తరించాయి.

ఆపై ఈ వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని కీలక ఆదేశాలు ఇవ్వగా.. ఆ ఆదేశాలు తమకు అభ్యంతరకంగా ఉన్నాయంటూ కొందరు ముస్లిం విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.

సంబంధిత వార్త: హిజాబ్‌పై కేంద్రం హోంమంత్రి అమిత్‌ షా ఏమన్నారంటే..

మరిన్ని వార్తలు