శశికళ ఆశలు అడియాశలు..!

21 Nov, 2020 07:30 IST|Sakshi

సాక్షి, చెన్నై: బాహ్యప్రపంచంలోకి ఎప్పుడెప్పుడు అడుగుపెడదామాని ఉవ్విళ్లూరుతున్న శశికళ ఆశలు అడియాశలయ్యాయి. గడువు కంటే ముందుగా విడుదల చేసే అవకాశం లేదని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్‌ శుక్రవారం స్పష్టం చేయడంతో ఆమె అభిమానులు డీలా పడిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానాకు గురైన  శశికళ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే నేరంపై ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌ సైతం అదే జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. కోర్టు తీర్పు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో నాలుగేళ్ల శిక్షాకాలం ముగుస్తుంది.    (మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం)

అయితే సామాజిక కార్యకర్త నరసింహమూర్తి సమాచార హక్కు చట్టం కింద పంపిన ఉత్తరానికి “ 2021 జనవరిలో శశికళ విడుదలవుతారని’ జైలు సూపరింటెండెంట్‌ బదులిచ్చారు. రూ.10. కోట్ల జరిమానా కూడా కోర్టుకు ఇటీవలే ఆమె చెల్లించారు. కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనసరించి శశికళకు మొత్తం 129 రోజుల సెలవులనుగా విడుదల చేయాలని శశికళ తరఫు న్యాయవాది ఇటీవల బెంగళూరు జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించాడు. ఈనేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ బెంగళూరులోని విధానసౌధలో మీడియా ప్రతినిధులు శుక్రవారం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, అవినీతి నిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. ఈనేరాలకు సత్ప్రవర్తన వర్తించదు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. చట్టాన్ని అనుసరించే శిక్షకాలం ఉంటుంది, ఇందులో రాజకీయ ప్రమేయానికి ఎంతమాత్రం చోటులేదని పేర్కొన్నారు. 

వెంటనే విడుదలకు కోర్టులో పిటిషన్‌.. 
ముందస్తు విడుదలకు అవకాశం లేదని కర్ణాటక మంత్రి స్పష్టం చేయడంతో బెంగళూరు కోర్టులో శుక్రవారం పిటిషన్‌ వేయాలని శశికళ న్యాయవాదులు నిర్ణయించారు. జరిమానా చెల్లింపు కూడా పూర్తయినందున శశికళను వెంటనే విడుదల చేయా లని కోరుతూ పిటిషన్‌ ధాఖలు చేయనున్నారు.    

మరిన్ని వార్తలు