ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. ఎంత పరిహారం వచ్చిందంటే?

21 Feb, 2023 11:28 IST|Sakshi

బెంగళూరు: మనం ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకుంటే కండక్టర్ ఒక్కోసారి చిల్లర లేదని చెబుతుంటాడు. కొన్నిసార్లు టికెట్‌ వెనకాల రాసి దిగేటపుడు తీసుకోమంటాడు. దీంతో కొంతమంది ఒక్క రూపాయి, రెండు రూపాయల చిల్లరను కండక్టర్‌కే వదిలేసి వెళ్తుంటారు.  కానీ కర్ణాటకకు చెందిన ఒ వ్యక్తి మాత్రం ఇలా కాదు. తనకు రావాల్సిన ఒక్క రూపాయిని కూడా వదులుకోలేదు. దీని కోసం వినియోగదారుల కోర్టు వరకు వెళ్లి విజయం సాధించాడు.

ఏం జరిగిందంటే?
ఒక్క రూపాయి కోసం కోర్టు వరకు వెళ్లిన ఇతని పేరు రమేశ్ నాయక్. 2019లో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్(బీఎంటీసీ) బస్సు ఎక్కి శాంతి నగర్‌ నుంచి మజెస్టిక్ బస్ డిపో వరకు టికెట్ తీసుకున్నాడు. టికెట్ ధర. రూ.29. దీంతో కండక్టర్‌కు రూ.30 ఇచ్చాడు రమేశ్. మిగతా ఒక్క రూపాయి చిల్లర ఇవ్వమని అడిగాడు. ఇందుకు కండక్టర్ అతనిపై కోపపడ్డాడు. చిల్లర లేదు ఇవ్వనని గట్టిగా అరిచాడు.

కండక్టర్ తీరు చూసి వాపోయిన రమేశ్.. బీఎంటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు కూడా పట్టించుకోలేదు. అతనికి ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదు. ఇక లాభం లేదని భావించిన రమేశ్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. రూ.15వేలు పరిహారంగా ఇప్పించాలని కోరాడు.

ఈ విషయాన్ని పరిశీలించిన న్యాయస్థానం బీఎంటీసీకి షాక్ ఇచ్చింది. రమేశ్‌కు రూ.2,000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. న్యాయప్రక్రియకు అయిన ఖర్చు కోసం మరో రూ.1,000 అదనంగా చెల్లించాలని చెప్పింది. 45 రోజుల్లోగా పరిహారం అందజేయాలని పేర్కొంది. ఒకవేళ చెప్పిన తేదీలోగా పరిహారం ఇవ్వకపోతే ఏటా రూ.6,000 వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

విషయం రూపాయి గురించే కాదు..
అయితే ఈ వ్యవహారంలో బీఎంటీసీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇది బస్సుల్లో రోజూ జరిగే సాధారణ విషయమేమని, సేవల్లో ఎలాంటి లోపం లేదని వాదించింది. రమేశ్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. న్యాయస్థానం మాత్రం వీరి వాదనను తోసిపుచ్చింది. ఇది ఒక్క రూపాయి చిల్లర విషయం గురించి మాత్రమే కాదని, వినియోగదారుడి హక్కు అంశమని స్పష్టం చేసింది. కండక్టర్ ప్రవర్తించిన తీరును తప్పుబట్టింది.  పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.
చదవండి: గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 70 చోట్ల ఎన్‌ఐఏ దాడులు..

మరిన్ని వార్తలు