ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్‌..!

26 Oct, 2022 10:53 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి దివాళీ సేల్ సందర్భంగా అక్టోబర్‌ 15న ఫ్లిప్‌కార్ట్‌లో 'ఏసస్ టఫ్' గేమింగ్ ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 20న ఇంటికి పార్సిల్ వచ్చింది. అయితే అది ఓపెన్ చేసిన అతనికి షాక్ తగిలింది. పార్సిల్‌ బాక్స్‌లో ల్యాప్‌టాప్‌కు బదులు పెద్ద రాయి, ఈ-వేస్ట్ వచ్చింది. దీంతో అతడు ఫ్లిప్‌కార్డ్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. దాన్ని రిటర్న్ తీసుకునేందుకు వారు నిరాకరించారు.

ల్యాప్ ఆర్డర్ చేసిన వ్యక్తి చిన్మయ రమణ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. తనకు వచ్చిన పార్సిల్‌లో ల్యాప్‌టాప్ బాక్స్‌పై ప్రోడక్ట్ డీటేయిల్స్‌ను చింపేశారని, అది ఓపెన్ చేసి చూస్తే రాయి, కంప్యూటర్ వేస్టేజ్ ఉందని వాపోయాడు. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్‌ను సంప్రదించినా సరైన స్పందన లేదని, ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశాడు. తాను సాక్ష‍్యాధారాలతో  సహా ఫిర్యాదు చేసినా.. మూడు రోజుల తర్వాత వారు స్పందించారని రమణ వాపోయాడు. రీఫండ్ ఇచ్చేందుకు సెల్లర్ నిరాకరించాడని, పార్సిల్ డెలీవరీ సమయంలో ఎలాంటి డ్యామేజీ కూడా జరగలేదని చెప్పారని తెలిపాడు.

ఫ్లిప్‌కార్ట్ సర్వీసు అస్సలు బాగాలేదని రమణ ఆరోపించాడు. తన ఫిర్యాదు అనంతరం మళ్లీ అప్డేట్ ఇస్తామని చెప్పారని, కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు ఈమెయిల్ పంపినా ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నాడు. తాను చెప్పేది అబద్దమని ఎవరికైనా అన్పిస్తే, తన ఖాతా పాత ఆర్డర్లు చెక్‌చేసుకోవచ్చని చెప్పాడు. 2015 నుంచి తాను ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌గా ఉన్నానని, చాలా ఆర్డర్లు పెట్టానని వివరించాడు.

చదవండి: ఫోన్‌ రిపైర్‌ చేసేలోపే ఒక్కసారిగా బ్లాస్ట్‌: వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు