మీ కక్కుర్తి తగలడా.. ప్రాణం కన్న బీరే ముఖ్యమా?

21 Apr, 2021 14:29 IST|Sakshi

మద్యం లారీ బోల్తా.. తన్నుకుచచ్చిన జనాలు

బెంగళూరు: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దేశంలో విలయం సృష్టిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్నో కఠిన చర్యలను తీసుకుంటున్నప్పటికి జనాలు మాత్రం కొంచెం కూడా భయపడటం లేదు. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజేషన్‌ వంటి వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు. అన్నింటి కంటే దారుణం ఏంటంటే.. గుంపులు గుంపులుగా తిరుగుతూ.. ఎక్కడికక్కడ కోవిడ్‌ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. జనాలకు తమ ప్రాణల గురించి ఏ మాత్రం ఆలోచన లేదు. ఈ వీడియో చూస్తే.. ఇది ముమ్మాటికి నిజమే అనిపిస్తుంది. 

మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఇంకేముంది.. ఫ్రీగా మందు లభిస్తుండటంతో జనాలు ఎగబడ్డారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ.. మందు బాటిళ్ల కోసం పరిగెత్తారు. కరోనా వస్తే తగ్గుతుంది.. కానీ మందు ఫ్రీగా లభిస్తుందా అన్నట్లు ఉంది వారి ధోరణి. ఈ సంఘటన కర్ణాటక చిక్‌మంగళూరులో చోటు చేసుకుంది. మద్యం లోడుతో వెళ్తున్న లారీకి యాక్సిడెంట్‌ అయ్యి బోల్తా పడింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు డ్రైవర్‌ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని కూడా ఆలోచించకుండా మందు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. క్షణాల్లో విషయం సమీప గ్రామాలకు పాకడం.. వారు మందు బాటిళ్ల కోసం పరిగెత్తుకు రావడంతో.. అక్కడ వందలాదిగా జనాలు పోగయ్యారు.

ఇక బీరు బాటిళ్ల కోసం ఒకరిని ఒకరు తోసుకుంటూ.. అందినకాడికి చంక బెట్టుకుని వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు జనాలను కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నించినప్పటికి కుదరకపోవడంతో.. చివరకు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు మీ కక్కుర్తి తగలడా.. ప్రాణాల కంటే మందే ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: కరోనా తీవ్రరూపం: కిట్లు లేవు.. టీకాలు లేవు! 

మరిన్ని వార్తలు