‘బీజేపీ, కాంగ్రెస్‌లను.. కన్నడిగులు ఈసారి తిరస్కరిస్తారు’

30 Mar, 2023 10:04 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఈసీ శంఖారావం పూరించింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో.. పార్టీలన్నీ ప్రచారాన్ని ముమర్మం చేశాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపికపైనా పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రాంతీయవాద నినాదంతో ఎన్నికలకు వెళ్తున్న జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

బీజేపీ, కాంగ్రెస్‌.. జాతీయ పార్టీలను తిరస్కరించేందుకు కన్నడిగులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారాయన. మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. అదీ ఒకే విడతలో ముగించాలనుకోవడం మంచి పరిణామం. ఇప్పటికే మా పార్టీ 70 శాతం ప్రచారాన్ని ముగించింది అని పేర్కొన్నారాయన. ఇరు పార్టీల నుంచి పొత్తు కోసం తనకు ఆహ్వానం అందిందన్న ఆయన.. ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కర్ణాటకకు చేసిందేమీ లేదని, ఈ లెక్కన ఈసారి ప్రాంతీయవాదానికే కన్నడ ప్రజలు కట్టం కడతారని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే.. అధికార బీజేపీ, మరో ప్రతిపక్షం కాంగ్రెస్‌లు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ పాలనపై వ్యతిరేకత తమకు బాగా కలిసొస్తుందని చెబుతున్న కాంగ్రెస్‌.. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక ప్రధాని మోదీ, అమిత్‌ షా లాంటి సీనియర్లు దృష్టి సారించిన కర్ణాటక ఎన్నికల్లో.. గెలుపు తమదేనన్న ప్రకటించుకుంటోంది బీజేపీ. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. పైగా 2024 సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకునే ఉద్దేశంలో ఉంది బీజేపీ.

ఇదీ చదవండి: ఆత్మ విశ్వాసం.. ఆత్మ గౌరవం.. అసంతృప్తి చెరిపేయడం.. ఎవరికో?

మరిన్ని వార్తలు