Bengaluru: కోవిడ్‌ నుంచి కోలుకున్న 31 మందికి గుండెపోటు

12 Jul, 2021 10:52 IST|Sakshi

కోలుకున్న యువతలో గుండెజబ్బుల బెడద

పలువురికి శస్త్రచికిత్సలు

ఓ సర్వేలో హెచ్చరిక 

సాక్షి, బెంగళూరు: కోవిడ్‌– 19 మహమ్మారి గుండెకు తీవ్ర చేటు చేస్తోంది. వైరస్‌ నుంచి కోలుకున్న యువకుల్లో రక్తం గడ్డ కట్టడంతో గుండెపోటు సమస్య అధికంగా కనబడుతోంది. బెంగళూరులో కోవిడ్‌తో కోలుకున్న 31 మందికి నాలుగు వారాల్లోగా గుండెపోటు రావడంతో ఆస్పత్రుల పాలయ్యారు. ప్రముఖ గుండెజబ్బుల ఆస్పత్రి సర్వేలో ఈ చేదునిజం వెల్లడైంది. అలా చేరిన 31 మంది రోగుల్లో ఆరుమందికి యాంజియోప్లాస్టి, మరో ముగ్గురికి బైపాస్‌ సర్జరీ చేయవలసి వచ్చింది. కోవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో కరోనా లక్షణాల జాడలు 1 నుంచి 3 నెలల వరకు ఉంటున్నాయని వైద్యనిపుణులు తెలిపారు. కోలుకున్న 21 నుంచి 108 రోజులు మధ్య గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేల్చారు.  

రెండో దశలోనే అధికం  
కోవిడ్‌ మొదటి దశ కంటే రెండో దశలో పెద్దమొత్తంలో ఔషధాలు వాడినవారికి కోలుకుతున్న తరువాత గుండె ధమనుల్లో వాపు వచ్చి గుండెపోటు ప్రమాదం పెరిగింది. యువకులకు కోవిడ్‌ చికిత్సలో అధికంగా స్టెరాయిడ్స్‌ ఔషధాల వాడకం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదమూ హెచ్చింది. రక్తం చిక్కబడి ఇతర అవయవాల్లో కూడా గడ్డ కట్టడం ప్రాణాపాయానికి దారితీస్తోంది. కాబట్టి కరోనా నుంచి కోలుకున్నవారు వైద్యుల సలహామేరకు రక్తాన్ని పలుచబరిచే ఔషధాలను ఉపయోగించాలని హృద్రోగ నిపుణుడు డాక్టర్‌  సీఎన్‌.మంజునాథ్‌ తెలిపారు.

2 వేల దిగువకు కేసులు 
మహమ్మారి కరోనా వైరస్‌ వేగం మరికొంచెం తగ్గింది. గత 24 గంటల్లో కన్నడనాట 1,978 పాజిటివ్‌లు వచ్చాయి. మరో 2,326 మంది కోలుకోగా, 56 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,71,298 కి పెరిగింది. అందులో 27,98,703 మంది కోలుకున్నారు. 35,835 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం 36,737 మంది చికిత్స పొందుతుండగా, పాజిటివిటీ రేటు 1.24 శాతానికి దిగొచ్చింది.  

బెంగళూరులో 433 కేసులు
బెంగళూరులో తాజాగా 433 కేసులు, 203 డిశ్చార్జిలు, 8 మరణాలు నమోదయ్యాయి. బెంగళూరులో మొత్తం కేసుల సంఖ్య 12,19,378కు పెరిగింది. అందులో 11,90,182 మంది కోలుకున్నారు. 15,736 మంది మరణించారు. ప్రస్తుతం 13,459 మంది చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో మరో 1,58,898 మందికి కరోనా టెస్టులు చేశారు. మొత్తం పరీక్షలు 3,59,34,618 కి పెరిగాయి.  కొత్తగా 89,037 మందికి టీకాలివ్వగా, మొత్తం టీకాలు 2,56,10,929 కి చేరాయి.   

మరిన్ని వార్తలు