Bengaluru: కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది!

9 Jul, 2021 08:48 IST|Sakshi
గురువారం బెంగళూరు జేపీ నగరలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం

మరో 2,530 కరోనా కేసులు , 62 మంది మృతి  

బెంగళూరులో తగ్గుదల

సాక్షి, బెంగళూరు: రెండురోజులతో పోలిస్తే కరోనా రక్కసి ప్రభావం కొంచెం తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ సోకి చికిత్స పొందుతూ 62 మంది మరణించారు. కొత్తగా 2,530 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 3,344 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  

బెంగళూరులో తగ్గుదల..  
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 28.64 లక్షల మందికి కోవిడ్‌ సోకగా, 27.90 లక్షల మంది కోలుకున్నారు. 35,663 మంది మృత్యువాత పడ్డారు. ఇక బెంగళూరులోనూ కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. కొత్తగా 514 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 753 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 9 మంది మరణించారు. తాజాగా 1,55,773 మంది కోవిడ్‌ టీకా తీసుకున్నారు.  

బ్లాక్‌ఫంగస్‌కు బాలుడు బలి..  
బ్లాక్‌ ఫంగస్‌ చిన్నపిల్లలపై పంజా విసురుతోంది.  బ్లాక్‌ఫంగస్‌ సోకి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. చిత్రదుర్గకు చెందిన బాలునికి మే 30న బ్లాక్‌ ఫంగస్‌ సోకింది. ఇన్ఫెక్షన్‌ రావడంతో కంటిని తొలగించారు. అప్పటికి కరోనా వచ్చినట్లు ఎవరూ గుర్తించలేదు. యాంటీబాడీ టెస్ట్‌ చేయగా కోవిడ్‌ జాడ వెల్లడైంది. అక్కడి నుంచి మైసూరుకు, ఆ తరువాత బెంగళూరు బౌరింగ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. 

ఫంగస్‌ మెదడుకు చేరడంతో చిన్నారి ప్రాణం నిలవలేకపోయింది.  రాష్ట్రంలో ఇప్పటివరకు 3,446 మందికి బ్లాక్‌ ఫంగస్‌ సోకింది. వారిలో 298 మంది మరణించారు. బెంగళూరులో 1,088 కేసులు రాగా, 101 మంది మృత్యువాత పడ్డారు.  

మరిన్ని వార్తలు