Karnataka: తలనొప్పి తగ్గిస్తానని నిమ్మకాయ ఇచ్చాడు.. ఐదు రోజుల తర్వాత వెళ్తే...

13 Dec, 2021 09:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బెంగుళూరు: మూఢనమ్మకం ఓ మహిళ ప్రాణాలు తీసింది. అల్లోపతి వైద్యంతో ఫలితం లేదని భూత వైద్యుడిని సంప్రదిస్తే ఆ అభాగ్యురాలి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కూతురు తెలిపిన వివరాల ప్రకారం.. గౌడరహళ్లికి చెందిన పార్వతి (37) గత రెండు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోంది. 

పలు ఆస్పత్రుల్లో చెకప్‌లు కూడా చేయించుకుంది. అయితే, ఆమెకు అంతా బాగానే ఉందని, ఎటువంటి సమస్యలు లేవని వైద్యులు చెప్పారు. కానీ, పార్వతి తలనొప్పి మాత్రం తగ్గలేదు. చివరగా బంధువుల సూచన మేరకు డిసెంబర్‌ 2న ఆమెను కుటుంబ సభ్యులు మను అనే భూత వైద్యునికి వద్దకు తీసుకెళ్లారు. బెక్క గ్రామంలో నివసించే మను ఓ నిమ్మకాయ ఇచ్చి కొద్ది రోజుల తర్వాత రమ్మన్నాడు. 
(చదవండి: గతంలో కోవిడ్‌.. తాజాగా డెంగ్యూ.. బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి)

అతను చెప్పిన ప్రకారం డిసెంబర్‌ 7న బాధితురాలిని అక్కడకు మరోసారి తీసుకెళ్లారు. తలనొప్పిని తగ్గిస్తానని చెప్పి మను పార్వతి తలపై, ఒంటిపై కర్రతో విపరీతంగా బాదాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను చెన్నరాయపట్నంలోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
(చదవండి: West Bengal: ఆహా ఏమి అదృష్టం! ఉదయం కొన్నాడు.. సాయంత్రానికి జాక్‌పాట్‌ కొట్టాడు!!)

మరిన్ని వార్తలు