గొర్రెల కాపరి సమయస్ఫూర్తికి ఫిదా అవుతోన్న నెటిజన్లు

10 Aug, 2020 14:34 IST|Sakshi

బెంగళూరు: దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ సత్య ప్రధాన్‌ తన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సభ్యుల మధ్య ఓ గొర్రెల కాపరి, అతడి పెంపుడు కుక్క కూర్చొని ఉన్నాయి. కరోనాను దృష్టిలో పెట్టుకుని వీరంతా చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్‌ ధరించి ఉన్నారు. ‘భారీ వరదలతో కృష్ణానది పొంగిపొర్లుతోంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సభ్యులు ఈ గొర్రెల కాపారిని కాపాడారు. వరదల కారణంగా ఈ కుర్రాడు తన గొర్రెలను వదిలేసి వచ్చాడు. కానీ పెంపుడు కుక్కను మాత్రం తనతో పాటు తీసుకొచ్చాడు’ అంటూ సత్య ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు. (కుండపోత వర్షాలు: కొండచరియలు విరిగి...)
 

అంతేకాక ‘ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తే.. ‘గొర్రెలు ఎక్కడైనా స్వేచ్ఛగా మేస్తాయి. కానీ కుక్క అలా కాదు. దానికి నేనే భోజనం పెట్టాలి. అందుకే దాన్ని నా వెంట తీసుకొచ్చాను. గొర్రెలను వదిలేసినందుకు బాధగా ఉంది. కానీ అవి ఎలాగైనా బతుకుతాయనే నమ్మకంతోనే కుక్కను తీసుకొచ్చాను’ అన్నాడు. క్లిష్ట సమయంలో ఈ గొర్రెల కాపరి అద్భుతమైన సమయస్ఫూర్తి చూపాడు. ఈ సంఘటన, ఈ ఫోటో నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి’ అంటూ సత్య ప్రధాన్‌ ఈ ఫోటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. అంతేకాక ‘కష్టాలు వచ్చినప్పుడు మనిషిలోని పోరాట పటిమ, కరుణ వెల్లడవుతాయి. మనిషి నమ్మకానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిస్తుంది’ అన్నారు సత్య ప్రధాన్‌. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉరుములతో కూడిన వర్షాల వల్ల తీరప్రాంత జిల్లాలు, కొన్ని ఉత్తర జిల్లాలు, కొడగు జిల్లా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. (ముంబైని ముంచెత్తిన వర్షాలు)
వర్షం పరిమాణం కొంత వరకు తగ్గింది.. కాని పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. కొడగు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి.

మరిన్ని వార్తలు