ప్రేక్షకులకు ఏమైంది?

29 May, 2022 12:42 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ప్రతి శుక్రవారం థియేటర్లలో అభిమానుల సందడి మిన్నంటేది. టికెట్ల దొరకాలంటే నానా పాట్లు పడేవారు. కొత్త సినిమా వస్తోందంటే ఉద్వేగం మిన్నంటేది. కానీ ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు థియేటర్ల వైపు అంతగా చూడడం లేదనే చెప్పాలి.  కేజీఎఫ్‌–2 సినిమా విడుదల తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలో నూతనోత్సాహం కనిపించింది. కరోనా మహమ్మారి వల్ల చాలా సినిమాల షూటింగ్‌లు అటకెక్కాయి. కేజీఎఫ్‌ విజయంతో ఆ సినిమాల దర్శక నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడానికి నాంది పలికారు. గత మూడు వారాలుగా పదుల సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి. గత వారం సుమారు 11 సినిమాలు తెరమీదకు వచ్చాయి.  

తొలిరోజే ముఖం చాటేశారు   
అయితే ఆ సినిమాల ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి. గత వారం విడుదల అయిన దాదాపు అన్ని సినిమాలు ఒక్క రోజు ప్రదర్శనకే పరిమితమయ్యాయి. ప్రేక్షకులు కరువై రెండో రోజు కొన్ని థియేటర్లలో ప్రదర్శన రద్దు చేశారు. ఈ వారం విడుదలయిన కొన్ని సినిమాలు మొదటి షోనే రద్దు అయ్యాయి. దీంతో నిర్మాతల్లో ఆందోళన మొదలైంది.  

కారణాలు అనేకం  
కరోనా వల్ల ఓటీటీకి ప్రజలు అలవాటు పడిపోవడం, టికెట్లు రేట్లు అధికంగా ఉండడం, పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం వంటివి కారణాలుగా భావిస్తున్నారు. ప్రతి సినిమా కూడా కేజీఎఫ్‌ అంతటి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్న ప్రేక్షకులూ పెరిగిపోయారు. మరోవైపు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో ప్రముఖులు చాలా మంది బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో థియేటర్లలో సినిమాను బతికించడం కోసం కన్నడ సినీ రంగ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు