గజరాజా.. ఎందుకింత ఘోరం చేశావ్‌

12 Sep, 2021 14:07 IST|Sakshi

క్రిష్ణగిరి: అందరూ గజముఖున్ని పూజించే సమయంలో ఇద్దరు రైతులను ఓ అడవి ఏనుగు పొట్టనబెట్టుకుంది. ఈ విషాద సంఘటన  సూళగిరి సమీపంలో చోటు చేసుకొంది. వేపనపల్లి సమీపంలోని నేర్లగిరి గ్రామానికి చెందిన రైతులు నాగరాజ్, చంద్రప్ప. శుక్రవారం రాత్రి వారి పొలాల వద్దకు కాపలా వెళ్లారు. ఈ సమయంలో ఒంటి ఏనుగు వారిపై దాడి చేయడంతో ప్రాణాలు విడిచారు.

శనివారం ఉదయం ఆ ప్రాంతానికెళ్లిన స్థానికులకు నాగరాజ్, చంద్రప్పల మృతదేహాలను గమనించి అటవీశాఖాధికార్లకు సమాచారమిచ్చారు. అటవీ సిబ్బంది మృతదేహాలను స్వాధీనపరుచుకొని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వేపనపల్లి ఎమ్మెల్యే కే.పి. మునిస్వామి, మాజీ ఎమ్మెల్యే మురుగన్‌లు ఆస్పత్రికెళ్లి మృతుల బంధువులకు సంతాపం తెలియజేశారు. అటవీశాఖాధికారిణి కార్తిక బాధిత కుటుంబాలకు తలా రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ ఘోరంతో పేరండపల్లి, కామనదొడ్డి, పోడూరు, ఆళియాళం, రామాపురం, శానమావు తదితర అటవీ ప్రాంత గ్రామాల రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.  

చదవండి: పచ్చని కొమ్మలు వాడనే లేదు.. పెళ్లి ముచ్చట్లు తీర లేదు.. అంతలోనే..

మరిన్ని వార్తలు