ఒక ఊరి కథ: పిల్లా జెల్లా రోజంతా బయటే!

22 Jul, 2022 11:44 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: సుభిక్షంగా ఉండాలనుకుంటూ ఆ ఊరంతా ఖాళీ అయిపోతుంది. ఒక్కరోజంతా పిల్లా జెల్లా గోడ్డుతో బయటే గడుపుతుంది.  వన భోజనాల సమయంలో మండలంలోనే ఆ ఊరు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. రోళ్ల మండల పరిధిలోని దొమ్మరహట్టి గ్రామంలోని ప్రజలు ఏటా సంప్రదాయం ప్రకారం.. ఊరి నుంచి పిల్లాపాపలు, జంతువులతో ఊరిబయటకు తరలిపోతారు. 

సమీపాన గుడారాలు వేసుకున్నారు. ముందుగా ఊరి చుట్టు ముళ్ల కంపల కంచెను వేశారు. చెట్టు దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాది ఒకసారి ఆషాఢ మాసంలో గ్రామాన్ని బహిష్కరించి చెట్టు దేవునికి వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పించడం అనవాయితీ. 

ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని, ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉంటారని గ్రామస్తుల నమ్మకం. రకరకాల వంటకాలు చేసి బంధుమిత్రులతో ఆరగించారు. గురువారం నాడు వనభోజనం నిర్వహించి.. సాయంత్రం వరకు ఊరి బయటనే ఆటపాటలతో గడిపారు.

మరిన్ని వార్తలు