అందరి చూపు సుప్రీం వైపు.. సరిహద్దుల్లో భారీగా బలగాలు

30 Nov, 2022 08:45 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక–సరిహద్దు వివాదంపై బుధవారం సుప్రీంకోర్టులో అతి ముఖ్యమైన విచారణ జరగనుండగా, అందరి చూపు సర్వోన్నత న్యాయస్థానంపై కేంద్రీకృతమైంది. తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ సర్కారుతో పాటు ప్రజల్లోనూ నెలకొంది. దశాబ్దాలుగా నానుతున్న ఈ సున్నితమైన అంశం వల్ల ఘర్షణలు తలెత్తకుండా కర్ణాటక– మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఢిల్లీలో సీఎం మంతనాలు  
రాష్ట్రం తరఫున గట్టిగా వాదనలు వినిపించాలని సీఎం బసవరాజ బొమ్మై ప్రముఖ న్యాయవాదులతో చర్చలు జరిపారు. సరిహద్దు వివాదంపై మహాజన్‌ నివేదికే తుది తీర్పు అని, కానీ మహారాష్ట్ర సుప్రీంకోర్టులో కేసులు వేయడం సబబు కాదని పేర్కొన్నారు. సీఎం మంగళవారం ఢిల్లీలో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గిని కలిసి ఈ అంశంపై చర్చించారు.  

మంగళవారం బెళగావి జిల్లా నిప్పాణి వద్ద మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏడీజీపీ అలోక్‌కుమార్‌ తనిఖీలు  

మహారాష్ట్ర నాయకుల వల్లనే గొడవ  
తరువాత బొమ్మై విలేకరులతో మాట్లాడుతూ సరిహద్దు వివాదంపై చట్టపరమైన పోరాటాలను రోహత్గీకి వివరించానని, సుప్రీంకోర్టులో పటిష్టంగా వాదనను వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం సమరి్పంచిన అభ్యంతర పిటిషన్‌ గురించి విచారణ జరగనుంది. దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మహారాష్ట్ర నాయకులు సరిహద్దు వివాదంపై సీరియస్‌గా ఉన్నామని చెప్పుకునేందుకు పదే పదే వివాదాన్ని లేవనెత్తుతున్నారని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో కర్ణాటక బస్సులపై దాడులు జరగకుండా పోలీసు అధికారులతో చర్చించినట్లు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సరైన సౌకర్యాలు లేనందున ఆ గ్రామాలవారు కర్ణాటకలో చేరుతామని చెబుతున్నారన్నారు.

సరిహద్దుల్లో అలర్ట్‌   
కర్ణాటక–మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం ముఖ్యమైన వాదనలు జరగనున్నందున మంగళవారం బెళగావి నిప్పాణిలో ఏడీజీపీ అలోక్‌కుమార్‌ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మహారాష్ట్రలోని కొల్హాపుర ఐజీపీ, సాంగ్లి ఎస్‌పీ, బెళగావి ఐజీ, బెళగావి కమిషనర్, ఎస్‌పీ, డీఎస్‌పీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం అలోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. గతవారం కర్ణాటక బస్సులపై మహారాష్ట్రలో కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీనిపై మూడు కేసులు నమోదయ్యాయి, ఇకపై ఇలాంటివి జరగరాదన్నారు.  సుప్రీంకోర్టులో తీర్పు వెలువడనున్నందున సమావేశం నిర్వహించామని తెలిపారు. 

మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులతో ఉమ్మడిగా 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. నిత్యం 4 వేలకు పైగా కర్ణాటక బస్సులు మహారాష్ట్రలో సంచరిస్తాయని, మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు 176 బస్సులు వచ్చి వెళ్తుంటాయని తెలిపారు. తరువాత నిప్పాణి వద్ద మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ను అలోక్‌కుమార్‌ సందర్శించి అక్కడ ప్రయాణికులతో మాట్లాడారు. మహారాష్ట్ర డ్రైవర్లకు, ప్రయాణికులకు గులాబీ పూలు అందించి రెండు రాష్ట్రాల్లో శాంతి కాపాడాలని మనవి చేశారు.

మరిన్ని వార్తలు