పురిటిలో మృత్యు ఘోష.. ఆధార్‌ లేదని పంపేశారు.. తల్లి, కవలలు మృతి

4 Nov, 2022 10:19 IST|Sakshi
స్థానిక నాయకుల ఆందోళన

గర్భిణి కార్డు, ఆధార్‌ లేవని పంపేసిన తుమకూరు జిల్లా ఆస్పత్రి సిబ్బంది  

ఇంట్లో కవలలకు జన్మనిచ్చిన గర్భిణి  

వైద్యమందక తల్లీ శిశువుల మృతి

వైద్యో నారాయణ హరి అన్న నానుడికి కళంకం తెస్తున్నారు కొందరు వైద్యసిబ్బంది. ఏమాత్రం కనికరం లేకుండా వైద్యాన్ని నిరాకరించడం తమ గొప్పగా భావిస్తారు వీరు. నిరుపేద గర్భిణి కాన్పు కోసం వస్తే వైద్యం చేయడానికి బదులు, దయాదాక్షిణ్యం లేకుండా వెనక్కి పంపేశారు. ఇంట్లో ఆ అభాగ్యురాలు కవలలకు జన్మనిచ్చి తుదిశ్వాస విడిచింది. అమ్మ లేని లోకం దండగ అనుకున్నారో ఏమో.. ఆ శిశువులు కూడా తల్లి వెంటే వెళ్లారు. ఈ దారుణం ఏ మారుమూలో పల్లెలోనో కాదు, విద్యా వైద్య సేవలకు పేరుగన్న తుమకూరు నగరంలో చోటుచేసుకుంది. 

సాక్షి, బెంగళూరు: తుమకూరు నగరంలో ఉన్న జిల్లా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు బాలింత ప్రాణం గాలిలో కలిసింది. పురుటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది, అయితే నీకు ఆరోగ్య కార్డు లేదు, చికిత్స చేయలేం అని వైద్యసిబ్బంది  కఠినంగా తిరస్కరించారు. దీంతో ఆమె ఇంటికి వెళ్లిపోగా, అక్కడ కవల పిల్లలు జన్మించారు, కానీ తీవ్ర రక్తస్రావం జరిగి కన్నుమూసింది. వైద్యసిబ్బంది అలసత్వం ముగ్గురి ప్రాణాలు తీసిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.  

తెల్లవారుజామున ఆస్పత్రికి వెళ్లగా 
ఈ అమానుష సంఘటన తుమకూరులో జరిగింది. భారతీ నగరలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వీధిలో కస్తూరి (30) అనే మహిళ నివసిస్తోంది. తమిళనాడుకు చెందిన కస్తూరి ఇక్కడకు వచ్చి నెల రోజులు అవుతోంది. ఆమె ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆర్థిక సమస్యలతో భర్త 4 నెలల కిందట బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిండు గర్భిణి అయిన కస్తూరికి గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రసవ వేదన ప్రారంభం కావడంతో చుట్టుపక్కల మహిళలు ఆమె చేతికి కొంత డబ్బిచ్చి ఒక వృద్ధురాలిని తోడిచ్చి ఆటోలో జిల్లా ఆస్పత్రికి పంపించారు.

జిల్లా ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు వైద్యం చేయడానికి బదులుగా గర్భం దాల్చినప్పుడు ఆస్పత్రిలో నమోదు చేసుకుని కార్డు తీసుకున్నారా? అని అడగ్గా ఆమె లేదు అని చెప్పింది. ఆధార్, రేషన్‌ కార్డు అడిగారు. ఆధార్‌ కార్డు అడ్రస్‌ చూపగా తమిళనాడు చిరునామాతో ఉంది. అంతే.. మేం వైద్యం చేయం, బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆస్పత్రికి వెళ్లండి అని వైద్యసిబ్బంది సలహా ఇచ్చారు.  

తీవ్ర రక్తస్రావమై  
దిక్కుతోచని కస్తూరి ఆటోలో ఇంటికి తిరిగివచ్చింది. కొంతసేపటికి ఆమెకు ప్రసవమై ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. కానీ తీవ్రంగా రక్తస్రావం కావడంతో పాటు చూసేవారెవరూ లేకపోయారు. కొంతసేపటికి విలవిలలాడి తల్లీ బిడ్డలు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. తల్లిని కోల్పోయి కూతురు విలపిస్తూ ఉండగా అందరూ అక్కడకు చేరారు.  

ముగ్గురు సస్పెండ్‌
అంతా జరిగాక ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. డాక్టర్‌ ఉషా, మరో ఇద్దరి సిబ్బందిని సస్పెండ్‌ చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి మంజునాథ్‌ ప్రకటించారు. రాత్రికి ఆరోగ్యమంత్రి సుధాకర్‌ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. 

మేయర్, కార్పొరేటర్ల నిరసన 
ఈ దారుణంపై స్థానిక ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. 22వ వార్డు కార్పొరేటర్‌ శ్రీనివాస్, మేయర్‌ ప్రభావతి, ఉప మేయర్‌ టి.కే.నరసింహమూర్తి, కార్పొరేటర్‌ నయాజ్‌ అహ్మద్‌లు బాధితురాలి ఇంటికి వెళ్లి చుట్టుపక్కలవారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. తల్లీపిల్లల మృతదేహానికి నివాళులర్పించారు. జిల్లా ఆస్పత్రి వైద్యులు, డిహెచ్‌ఈ ఇక్కడికి వచ్చేదాకా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, వైద్యులు అందరు లంచాలకు అలవాటు పడి సక్రమంగా వైద్యం చేయడంలేదని, ఆస్పత్రి మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు.  జిల్లా ఆస్పత్రి సర్జన్‌ డాక్టర్‌ వీణా వచ్చి ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. కస్తూరికి తల్లి కార్డు లేక పోవడంతో వెనక్కి పంపించారని చెప్పారు. గర్భిణి ప్రతినెలా ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయంచుకునే సమయంలో వారికి తల్లి కార్డు ఇస్తారని అన్నారు. ఇకపై ఇలా జరగుకుండా చూసుకుంటామని, దీనికి ఎవరు బాధ్యులు అనేదానిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు