ఆధ్యాత్మిక క్షేత్రాలను మేల్కొల్పాలి: యోగి

30 May, 2022 05:27 IST|Sakshi

లక్నో: అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఆలయ నగరం కాశీని మేల్కొల్పాల్సిన అవసరం మన ముందు ఉందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. మథుర, బృందావన్, వింధ్యావాసిని ధామ్, నైమిష్‌ థామ్‌ వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను సైతం మరోసారి మేల్కొల్పాలని అన్నారు. అయోధ్య తర్వాత కాశీ వంతేనని పరోక్షంగా వెల్లడించారు. మథుర, కాశీలో మందిరం–మసీదుపై చట్టపరమైన వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో మత కలహాలు లేవని యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. ఆయన ఆదివారం లక్నోలో బీజేపీ కార్యనిర్వాహక సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఈసారి ఈద్‌ చివరి శుక్రవారం నమాజ్‌ను రోడ్లపై జరపలేదని గుర్తుచేశారు. ఇలా జరగడం ఉత్తరప్రదేశ్‌లో ఇదే తొలిసారి అన్నారు. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతిని ప్రజలు శాంతియుతంగా జరుపుకున్నారని వెల్లడించారు. ప్రార్థన స్థలాల్లో లౌడస్పీకర్ల వినియోగంపై స్పందిస్తూ.. అనవసరమైన శబ్దాలు లేని పరిస్థితి రావాలని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ శ్రేణులకు యోగి ఆదిత్యనాథ్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు