కశ్మీరీ పండిట్ల గాథ...

3 Apr, 2022 04:50 IST|Sakshi

గుండెల్ని పిండేసే వ్యథ 32 ఏళ్లుగా సొంత నేలకు దూరం

వేలాదిమందికి శరణార్థి శిబిరాలే దిక్కు

పట్టించుకున్నవారే లేరంటూ ఆక్రోశం

ప్రభుత్వ సాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు

భూతల స్వర్గమైన కశ్మీర్‌ లోయలో 32 ఏళ్ల క్రితం జరిగిన ఆ దారుణాలు లక్షలాది మంది గుండెల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. నిత్య భయోత్పాతానికి, సామూహిక హత్యాకాండకు జడిసి కట్టుబట్టలతో లోయను వీడి వచ్చిన నాటినుంచీ వాళ్లు న్యాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. సొంత నేలకు దూరంగా, ఏ సదుపాయాలూ లేని శరణార్థి శిబిరాల్లో ఎవరికీ పట్టని అనాథల్లా నిస్సహాయంగా బతుకీడుస్తున్నారు. వాళ్లే... కశ్మీరీ పండిట్లు. ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు మారుతున్నా తమ గోడు పట్టించుకుంటున్న వారే లేరన్న వారి ఆక్రందన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా సృష్టించిన వివాదంతో పండిట్ల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది...

కశ్మీరీ పండిట్ల ఊచకోతకు, తదనంతర సామూహిక వలసలకు మూగ సాక్షిగా 1990 సంవత్సరం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఆ అల్లర్ల అనంతరం 1990 జనవరి–మార్చి మధ్య లక్షన్నర మంది కశ్మీరీ పండిట్లలో కనీసం లక్ష మందికి పైగా లోయను వీడినట్టు పలు నివేదికలు తేల్చాయి. మహా అయితే 3,000 కుటుంబాలు అక్కడ మిగిలాయని అంచనా. అవి కూడా 2010 నాటికి 800కు తగ్గాయి. కశ్మీర్‌ ప్రభుత్వ పునరావాస కమిషన్‌ (శరణార్థుల) అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారమే 60 వేల కుటుంబాలు లోయను వీడాయి. వీరిలో చాలామంది 30 ఏళ్లుగా జమ్మూ, పరిసరాల్లోని శరణార్థి శిబిరాల్లో దయనీయ పరిస్థితుల్లో తలదాచుకుంటున్నారు. మరో 23 వేల కుటుంబాలు దేశ నలుమూలల్లోనూ విదేశాల్లోనూ స్థిరపడ్డాయి.

లోయలో ఇంతటి కల్లోలానికి కారణమైన హిందూ, ముస్లిం ఘర్షణలు 1980ల నుంచే పెరుగుతూ వచ్చాయి. నిజానికి లోయలో 1950ల నుంచి చూసినా హిందూ పండిట్ల సంఖ్య 4 నుంచి 5 శాతం మించి లేదని గణాంకాలు చెప్తున్నాయి. 94 శాతం దాకా ముస్లిం జనాభాయే. అయినా లోయను సంపూర్ణంగా ఇస్లామీకరించే ప్రయత్నాలు 1980ల్లో ఊపందుకున్నాయి. ఫలితంగా స్థానిక ముస్లింలలో హిందువులపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. వారి నివాసాలపై దాడులతో మొదలై హిందూ నేతలను హతమార్చడం దాకా వెళ్లింది. వేర్పాటువాదమే సిద్ధాంతంగా జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ వంటివి పుట్టుకు రావడంతో పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడింది. 1990 జనవరి హింసాకాండకు ఇదంతా ఓ భయానక నేపథ్యంగా అమరింది.

ఆ మూడు నెలలూ...
1990 జనవరి తొలి రోజులు కశ్మీరీ పండిట్ల గుండెల్లో ఆరని మంటలు రగిల్చాయి. అప్పటికే తారస్థాయికి చేరిన మత అసహనం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. హిందువులు మతం మారడమో, లోయను వీడటమో, మరణించడమో తేల్చుకోవాలంటూ తీవ్రవాద మూకలు పండిట్ల ఇండ్లపై పడి మారణహోమం సృష్టించారు. కనిపించిన వారినల్లా కాల్చి చంపుతూ నరమేధానికి దిగారు. ఆ క్రమంలో అంతులేని దారుణ అత్యాచారాలకు, చెప్పుకోలేని ఘోరాలకు పాల్పడ్డారు. దాంతో పండిట్ల కుటుంబాలు కట్టుబట్టలతో లోయ ను వీడాయి. ఈ హింసాకాండలో మరణించిన హిందువులు 100 లోపేనని అధికారిక గణాంకాలు చెప్తున్నా వాస్తవ సంఖ్య వేలల్లో ఉంటుందంటారు.

పట్టించుకున్న వాళ్లే లేరు...
జమ్మూ, పరిసరాల్లోని శిబిరాల్లో తలదాచుకున్న పండిట్లు, కొద్ది నెలల్లో లోయకు తిరిగి వెళ్తామన్న ఆశలు క్రమంగా ఆవిరవడంతో దశాబ్దాలుగా అక్కడే బతుకీడుస్తున్నారు. ప్రభుత్వపరంగా వీరికి పెద్దగా సాయం కూడా అందడం లేదు. 2004లో యూపీఏ ప్రభుత్వం పండిట్ల కోసం టౌన్‌షిప్‌ల్లోని చిన్న ఫ్లాట్లను కొందరు కొనుక్కోగా ఆ స్తోమతలేని చాలామంది ఇప్పటికీ దయనీయంగానే గడుపుతున్నారు. ఆర్థిక కష్టాలతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు కూడా. అయినా నాటి గాయాలు వీరిలో ఎంత తాజాగా ఉన్నాయంటే... ఇప్పటికీ చాలామంది తమ అవస్థలపై పెదవి విప్పేందుకు కూడా ఇష్టపడటం లేదు! 2008లో ప్రధాని పునరావాస ప్యాకేజీ కింద పండిట్లకు కొన్ని ఉద్యోగాలివ్వడంతో సరిపెట్టారు. వారికి ఉద్యోగాలతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.7.5 లక్షల దాకా ఆర్థిక సాయం ఇస్తామని 2021లో కేంద్రం ప్రతిపాదించినా ముందడుగు పడలేదు. దాంతో మోదీ ప్రభుత్వం కూడా తమకోసం చేసిందేమీ లేదంటూ పండిట్లు వాపోతున్నారు.

కశ్మీరీ పండిట్ల డిమాండ్లు
► కనీసం రూ.25 వేల పై చిలుకు నెలవారీ పరిహారం
► కేంద్రపాలిత ప్రాంత హోదాతో కూడిన ప్రత్యేక హోమ్‌లాండ్‌
► మైనారిటీ హోదా, తదనుగుణమైన హక్కులు, ప్రయోజనాలు  
► నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు తేల్చాలి. అన్నివిధాలా న్యాయం చేయాలి
► తమ నివాసాలు, భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించి వెనక్కి ఇప్పించాలి

ఒక విజయం, వంద వివాదాలు
కశ్మీరీ పండిట్ల ఊచకోత, వలసలపై దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తీసిన కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ.15 కోట్లతో రూపొందిన ఈ సినిమా 20 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల పై చిలుకు కలెక్షన్లు రాబట్టి రికార్డుల మోత మోగించింది. మార్చి 11న కేవలం 600 థియేటర్లలో పెద్దగా హడావుడి లేకుండా విడుదలైనా, చూస్తుండగానే టాక్‌ ఆఫ్‌ ద కంట్రీగా మారిపోయింది. ప్రధాని మోదీ మొదలుకుని అమిత్‌ షా తదితర కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రముఖులంతా సినిమాను ప్రశంసలతో ముంచెత్తడమే గాక అందరూ తప్పక చూడాలంటూ పిలుపునిచ్చారు. ఇందుకు విపరీతమైన మౌత్‌ పబ్లిసిటీ తోడై చూస్తుండగానే 4,000కు పైగా థియేటర్లకు విస్తరించింది.

పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ఉచితంగా షోలు వేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపులిచ్చాయి. యూఏఈ, సింగపూర్‌ వంటి దేశాల్లో కూడా నిషేధం తొలగి త్వరలో విడుదలవుతుండటంతో కలెక్షన్లు ఇంకా కొనసాగేలా ఉన్నాయి. అయితే సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పైగా దీన్ని బీజేపీ ప్రమోట్‌ చేస్తోందన్న అభిప్రాయంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. సినిమాకు అనుకూలంగా, వ్యతిరేకంగా విమర్శలు, ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి. సినిమా అవాస్తవాలమయమని ఆప్‌ వంటి పార్టీలు అంటున్నాయి. మరో వర్గం మాత్రం సినిమాలో నిజాలు చూపించారని, పండిట్ల గుండెకోత ఇప్పటికైనా వెలుగులోకి వచ్చిందని అంటోంది. బెదిరింపుల నేపథ్యంలో అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రత కల్పించాల్సి వచ్చింది.

– నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు