అమ్మ ఆశీర్వాదం.. ఆపై యూట్యూబ్‌ అండతో.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు

23 Feb, 2022 18:42 IST|Sakshi

ఇంటర్నెట్‌ను సరిగా ఉపయోగించుకుంటే మంచే జరుగుతుంది. కానీ, 65 శాతం జనాభా సరదా కోణంలోనే చూస్తోంది. రోజూ వాట్సాప్‌ స్టేటస్‌లు.. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఫీడ్‌లతో వేస్ట్‌ చేస్తున్న ఇంటర్నెట్‌ డేటా గణాంకాలే అందుకు నిదర్శనం. అయితే.. ఇక్కడో యువకుడు అదే ఇంటర్నెట్‌ సాయంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తాను ఉంటున్న గడ్డపై ఎవరూ సాధించని ఘనత సాధించాడు.

జమ్ము కశ్మీర్‌ శ్రీనగర్‌కు చెందిన తుఫెయిల్‌ అహ్మద్‌ అనే యువకుడు.. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లో అర్హత సాధించాడు. జమ్ము నుంచి ఈ ఘనత సాధించిన తొలి గిరిజన వ్యక్తి తుఫెయిల్‌ కావడం విశేషం. పక్కా పల్లెటూరు.. పైగా కోచింగ్‌ స్తోమతలేని కుటుంబం ఆ యువకుడిది. అయినప్పటికీ అమ్మ ఆశీర్వాదంతో.. యూట్యూబ్‌ సాయంతో ఈ ఘనత సాధించాడు ఆ యువకుడు. అయితే ఇది కూడా అంత సులువుగా ఏం జరగలేదు. 

తుఫెయిల్‌ స్వగ్రామం శ్రీనగర్‌లోని ముల్నర్‌ హర్వాన్‌. పక్కా పల్లెటూరు కావడంతో ఇంటర్నెట్‌ సిగ్నల్‌ సరిగా ఉండదు. అందుకే పక్కనే ఉండే సిటీకి వెళ్లి.. యూట్యూబ్‌ వీడియోల్ని డౌన్‌లోడ్‌ చేసుకుని వచ్చేవాడు. వాటి సాయంతో మెటీరియల్‌ పొగుచేసి NEET కు ప్రిపేర్‌ అయ్యాడు. కొడుక్కి సెల్‌ఫోన్‌ కొని ఇచ్చేందుకు తాను దాచుకున్న డబ్బును అందించింది ఆ తల్లి. అలా తల్లి అందించిన సహకారం.. కష్టపడి చదివి నీట్‌ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యాడు.

‘‘మా ఊర్లో సరైన కరెంట్‌, మొబైల్‌ సిగ్నల్‌ సౌకర్యాలు లేవు. అందుకే పొరుగున్న ఉన్న ఊరికి నడుచుకుంటూ వెళ్లి వీడియోలు డౌన్‌ లోడ్‌ చేసుకుని వచ్చేవాడిని. ఈ నడక చిన్నతనంలో స్కూల్‌ చదువుకూ పనికొచ్చేది (రోజూ రెండు కిలోమీటర్లు స్కూల్‌ కోసం వెళ్లేవాడట). మా ఊళ్లో వైద్య సదుపాయాలు సరిగా లేవు. అందుకే డాక్టర్‌ అయ్యి ఈ ఊరికి సేవ చేయాలనుకుంటున్నా. కశ్మీర్‌ యువత మీద కొందరికి ఉన్న అభిప్రాయాన్ని చెరిపేయాలన్నది నా ఉద్దేశం. అది మా అమ్మ కోరిక కూడా ’’ అని చెప్తున్నాడు తుఫెయిల్‌.

ఇదిలా ఉండగా.. నార్త్‌ కశ్మీర్‌లో నీట్‌ కోసం ప్రిపేర్‌ అయ్యే విద్యార్థుల కోసం ఆర్మీ ఒక ఫ్రీ కోచింగ్‌ క్యాంప్‌ తెరిచిన సంగతి తెలిసిందే. రీజియన్‌లవారీగా రాత పరీక్షలో ఎంపికైన మొత్తం 50 మందికి ఇక్కడ ఉచితంగా శిక్షణ అందిస్తోంది ఇండియన్‌ ఆర్మీ. 

మరిన్ని వార్తలు