ఢిల్లీలో కశ్మీర్‌ వ్యక్తికి చేదు అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే.. వీడియో వైరల్‌

24 Mar, 2022 10:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్ పండిట్లపై 1990లో జరిగిన మారణకాండ ఆధారంగా ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అంచనాలకు మించి ఆడుతూ పలు రికార్డులను బద్దలుకొడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జమ్మూకశ‍్మీర్‌కు చెం​దిన ఓ వ్యక్తికి ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఐడీ ఫ్రూప్స్‌ ఉన్నప్పటికీ హోటల్‌లో అతడికి రూమ్‌ ఇచ్చేందుకు సదరు హోటల్‌ సిబ్బంది అంగీకరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

వివరాల ప్రకారం.. కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఓయో ద్వారా ఢిల్లీలోని హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేసుకున్నాడు. అనంతరం ఆ హోటల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో హోటల్ రిసెప్షన్‌లో ఉన్న మహిళా ఉద్యోగి అతడికి రూమ్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. సదరు వ్యక్తి తన ఆధార్‌ కార్డుతో సహా మరికొన్ని ఐడీ ఫ్రూప్స్‌ చూపించినప్పటికీ ఆమె అతడికి రూమ్‌ ఇవ్వలేదు.

అయితే, సదరు వ్యక్తి ఆమెను ప్రశ్నించడంతో.. ఆమె తన సీనియర్‌ అధికారికి ఫోన్‌ చేసి మాట్లాడిన అనంతరం.. కశ్మీర్‌కు చెందిన వ్యక్తులకు రూమ్‌ ఇవ్వకూడదని ఢిల్లీ పోలీసులు చెప్పినట్టు వివరణ ఇచ్చింది. దీంతో షాకైన సదరు వ్యక్తి తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్‌ మీడియాలో వివరిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం తాను వేరే హోటల్‌లో రూమ్‌ తీసుకున్నట్టు తెలిపాడు. 

ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ట‍్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన వ్యక్తులకు రూమ్‌ ఇవ్వకూడదనే ఆదేశాలేవీ తాము ఇ‍వ్వలేదని స్పష్టం చేశారు. పోలీసులపై ఇలాంటి తప్పడు ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఇది చదవండి: గుడిలో దళితుడికి ఘోర అవమానం.. దేవుళ్లను కించపర్చాడని..

మరిన్ని వార్తలు