separatist leader: గిలానీ మృతి, కశ్మీర్‌లో ఆంక్షలు, పాక్‌లో సంతాప దినం

2 Sep, 2021 11:42 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు, నిషే ధిత జమాత్‌-ఈ-ఇస్లామీ సభ్యుడు, హురియత్‌ కాన్ఫరెన్స్‌ మాజీ చైర్మన్‌ సయ్యద్‌ అలీ షా గిలానీ(92) మృతి చెందారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్‌లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు.

గతంలో ఎమ్మెల్యేగా ఉన్న గిలానీ గత ఏడాది రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2008 నుంచి కూడా గిలానీ గృహనిర్బంధంలో ఉన్నారు. హురియత్ కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌ పదవికి గతేడాది ఆయన రాజీనామా చేశారు. మొదట ఆయన జమాతే ఈ ఇస్లామి కశ్మీర్‌ సభ్యుడిగా  ఉన్నారు. మరోవైపు గిలానీ మృతిపట్ల పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.   

క‌శ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం
గిలానీ మ‌ర‌ణ‌ంతో క‌శ్మీర్ లోయ‌లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఇంట‌ర్నెట్ సేవ‌ల‌పై ఆంక్ష‌లు విధించడంతోపాటు మొబైల్ సేవ‌ల‌ను కూడా నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్, ఇతర ప్రధాన నగరాల్లో భద్రతా దళాలను మోహరించాలని అధికారులు ఆదేశించారు. వాహనాల రాకపోకలకు అనుమతి లేదని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు గిలానీ మృతిపై పాకిస్తాన్‌ ప్రధానమంత్రి  ఇమ్రాన్ ఖాన్  ట్విటర్‌ ద్వారా సంతాపం ప్రకటించారు. అంతేకాదు  ప్ర‌జ‌ల కోసం త‌న జీవితాన్ని ధార‌పోసిన గిలానీని భార‌త ప్ర‌భుత్వం వేదించిందని ఆరోపించారు. ఆయనకు నివాళిగా ఈ రోజు పాక్‌ జెండాను అవ‌న‌తం చేసి, అధికారిక సంతాప దినంగా పాటిస్తామని ఇమ్రాన్ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు