Terror Funding Case: యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవం

26 May, 2022 05:30 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ (56)కు పటియాలా హౌస్‌ ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు బుధవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మాలిక్‌ ఇటీవలే తన నేరాన్ని అంగీకరించడం తెలిసిందే. అతనికి మరణ శిక్ష విధించాలని ఎన్‌ఐఏ కోరింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద మాలిక్‌పై కేసులు నమోదయ్యాయి.

అతనికి యావజ్జీవంతో పాటు ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్‌ సింగ్‌ రూ.11 లక్షల జరిమానా కూడా విధించారు. 2017లో కశ్మీర్‌ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడానికి ఫ్రీడమ్‌ స్ట్రగుల్‌ పేరుతో నిధులు సమకూర్చాడంటూ మాలిక్‌పై ఎన్‌ఐఏ తొలి కేసు నమోదు చేసింది. కోర్టును మాలిక్‌ క్షమాభిక్ష కోరలేదని అతని లాయర్‌ వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే ఉరి తీయండనే కోరాడన్నారు. తీర్పు సందర్భంగా కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

పీఓకేలో శిక్షణ.. భారత్‌లో ధ్వంస రచన  
నిషేధిత జమ్మూకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌) నేతగా తరచూ వార్తల్లో కనిపించే మాలిక్‌ 1966 ఏప్రిల్‌ 3న శ్రీనగర్‌లోని మైసుమాలో పుట్టాడు. 1980ల నుంచే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు తెర తీశాడు. 1988లో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఆయుధాల వాడకం, ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ పొందాడు. జేకేఎల్‌ఎఫ్‌లో చేరి చురుగ్గా పనిచేశాడు. 1990 ఆగస్టులో ఎన్‌కౌంటర్‌లో పోలీసులకు దొరికిపోయాడు. 1994 మేలో బెయిల్‌పై విడుదలయ్యాడు.

కశ్మీర్‌ విముక్తికి శాంతియుత ఉద్యమం కొనసాగిస్తానని ప్రకటించాడు. జేకేఎల్‌ఎఫ్‌ చైర్మన్‌గా ఎదిగాడు. కొన్నాళ్లు హురియత్‌ కాన్ఫరెన్స్‌లోనూ çపనిచేశాడు. కశ్మీర్‌లో ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ 1999లో ప్రజా భద్రత చట్టం (పీఎస్‌ఏ) కింద అరెస్టయ్యాడు. 2002లో విడుదలయ్యాడు. 2009లో పాకిస్తానీ కళాకారిణి ముషాల్‌ హుస్సేన్‌ ములిక్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికి పదేళ్ల కుమార్తె రజియా ఉంది. ఆమె ప్రస్తుతం తల్లితో కలిసి పాకిస్తాన్‌లో నివసిస్తోంది.

యాసిన్‌ మాలిక్‌ 2013 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ మొహమ్మద్‌ సయీద్‌తో కలిసి వేదిక పంచుకున్నాడు. 2017 నాటి టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో 2019లో మాలిక్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. జమ్మూకశ్మీర్‌లో హింసాకాండకు సంబంధించి అతడిపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ కుమార్తె రుబైయా సయీద్‌ను 1989లో కిడ్నాప్‌ చేసిన కేసులో కూడా విచారణను ఎదుర్కొన్నాడు. 1990లో శ్రీనగర్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందిపై దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురు మరణించారు.
 

మరిన్ని వార్తలు