కేదార్‌నాథ్‌ ఘోర ప్రమాదం: పైలట్‌ చివరికాల్‌.. ‘మన బిడ్డ జాగ్రత్త’

19 Oct, 2022 09:58 IST|Sakshi

ముంబై: ఉత్తరాఖండ్‌ ఘోర విమాన ప్రమాదంలో పైలట్లు, యాత్రికులు మృత్యువాత పడ్డారు. ప్రతికూల వాతావరణంతోనే మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ఓ అంచనాకి వచ్చారు. అయితే.. ప్రమాదానికి ముందు కల్నల్‌(రిటైర్డ్‌), పైలట్‌ అనిల్‌ సింగ్‌(57) భార్యతో మాట్లాడిన మాటలు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. 

తూర్పు ఢిల్లీకి చెందిన అనిల్‌ సింగ్‌.. కుటుంబంతో పాటు ముంబై(మహారాష్ట్ర) అంధేరీలోని ఓ హౌజింగ్‌ సొసైటీలో గత పదిహేనుళ్లుగా ఉంటున్నారు. ఆయనకు భార్య షిరిన్‌ ఆనందిత, కూతురు ఫిరోజా సింగ్‌ ఉన్నారు. భార్య షిరిన్‌ ఫిల్మ్‌ రైటర్‌.. గ్రామీ అవార్డులకు నామినేట్‌ అయ్యారు కూడా. ఇక కూతురు ఫిరోజా.. మీడియాలో పని చేస్తోంది. అయితే.. ప్రమాదం కంటే ముందు రాత్రి అంటే సోమవారం రాత్రి ఆయన తన భార్యకు ఫోన్‌ చేసి పలు జాగ్రత్తలు సూచించినట్లు ఆనందిత తెలిపారు. 

ఆనందిత మాట్లాడుతూ.. గత రాత్రి ఆయన మాకు ఫోన్‌ చేశారు. ఫిరోజాకు ఆరోగ్యం బాగోలేదని ఆరా తీశారు. బిడ్డ జాగ్రత్త అంటూ ఫోన్‌  పెట్టేశారు. అవే ఆయన చివరి మాటలు అని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక ఇది ప్రమాదంగానే భావిస్తున్నామని, కుట్ర కోణంతో ఫిర్యాదు చేసే ఆలోచనలో లేమని ఆమె వెల్లడించారు. కూతురితో పాటు ఢిల్లీలో జరగబోయే భర్త అంత్యక్రియలకు ఆమె బయలుదేరారు.

2021 నవంబర్‌లో మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ పోలీస్‌ సిబ్బందిని తరలించడంలో అనిల్‌ సింగ్‌ కీలకంగా వ్యవహరించారు. 

మరోవైపు మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉండే ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన చాపర్‌ బెల్‌ 407(VT-RPN) కేదర్‌నాథ్‌ ఆలయం నుంచి గుప్తకాశీకి యాత్రికులను తీసుకెళ్లే క్రమంలో దేవ దర్శిని(గరుడ్‌ ఛట్టి) వద్ద ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణంతో కొండ ప్రాంతాల్లో అది పేలిపోయి ప్రమాదానికి గురై ఉంటుందని రుద్రప్రయాగ జిల్లా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనపై డీజీసీఏ తోపాటు ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో సైతం దర్యాప్తు చేపట్టింది.

మరిన్ని వార్తలు