ఢిల్లీలో మూతబడ్డ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు

23 May, 2021 09:02 IST|Sakshi

వ్యాక్సిన్‌ కొరత కారణంగా మూసి వేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ ప్రకటన

18–44 ఏళ్ల వారికి ఆగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

ఇలాగైతే వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడానికి 30 నెలలు పడుతుంది

టీకా లభ్యతపై కేంద్రానికి 4 సూచనలు చేసిన కేజ్రీవాల్‌

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ కోసం దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు వ్యాక్సిన్ల కొరతతో అడ్డంకులు వస్తున్నాయి. ఢిల్లీలో అనేక కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాలను మూసివేసినట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. శనివారం మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఆయన రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. వ్యాక్సిన్ల కొరత కారణంగా రాష్ట్రంలో ప్రస్తుతం మూడో దశలో భాగంగా జరుగుతున్న 18–44 ఏళ్ల వారికి ఇస్తున్న వ్యాక్సిన్‌ ప్రక్రియను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన వ్యాక్సిన్‌ డోస్‌లు అయిపోయాయని, ఈ కారణంగా అనేక వ్యాక్సిన్‌ కేంద్రాలు మూసివేయాల్సి వచ్చిందన్నారు. అంతేగాక కొన్నిచోట్ల పలు డోస్‌లు మిగిలి ఉన్నాయని, అవి పూర్తయిన వెంటనే నేటి నుంచి 18–44ఏళ్ల వారికి కేటాయించిన అన్ని వ్యాక్సినేషన్‌ కేంద్రాలు మూతబడతాయని వివరించారు.  అయితే కేంద్రం నుంచి మరిన్ని వ్యాక్సిన్‌ డోస్‌లను కోరామని, అవి వచ్చిన వెంటనే 18–44ఏళ్ల యువతకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామన్నారు.

అంతేగాక రాష్ట్రంలో ఆసుపత్రులు, పడకలు, ఐసీయూలు, వెంటిలేటర్లు వంటి సౌకర్యాలను అందిస్తున్నప్పుడు, కరోనా మరణాలను నివారించడానికి వ్యాక్సినేషన్‌ అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గమని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ డోస్‌లు అందుబాటులో లేకపోవడం అనేది కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ఆందోళన మాత్రమే కాదని, సామాన్యులు తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్నారని కేజ్రీవాల్‌ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చేసి దేశాన్ని కాపాడేందుకు వెంటనే వ్యాక్సిన్ల లభ్యతను పెంచాలని కేంద్రానికి ఢిల్లీ సీఎం విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీకి ప్రతి నెలా 80 లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు అవసరమని, కానీ మే నెలలో కేవలం 16 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే వచ్చాయన్నారు. అంతేగాక ఈ కోటాను కేంద్రం జూన్‌ నెలలో ఎనిమిది లక్షలకు తగ్గించిందని తెలిపారు. ఇప్పటివరకు ఢిల్లీలో సుమారు 50 లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లను ఇచ్చామన్నారు. ఢిల్లీలోని 18–44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేసేందుకు రాష్ట్రానికి రెండున్నర కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు అవసరమని తెలిపారు. ఇదే వేగంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగిస్తే ఢిల్లీలోని 18–44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేయడానికి కనీసం 30 నెలలు పడుతుందని కేజ్రీవాల్‌ అన్నారు.

కేంద్రప్రభుత్వానికి కేజ్రీవాల్‌ చేసిన నాలుగు సూచనలు

1. కోవాగ్జిన్‌ తయారుచేసే భారత్‌ బయోటెక్‌ సంస్థ తన ఫార్ములాను ఇతర కంపెనీలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దేశంలో వ్యాక్సిన్లు తయారుచేసే మిగతా కంపెనీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పిలిపించి, ఈ ఫార్ములాతో వ్యాక్సిన్‌ డోస్‌లను యుద్ధ ప్రాతిపదికన తయారు చేయాలని ఆదేశించాలి.

2. అన్ని విదేశీ వ్యాక్సిన్లను భారతదేశంలో వాడేందుకు అనుమతించాలి. కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యాక్సిన్ల తయారీదారులతో స్వయంగా మాట్లాడాలి. ఈ పనిని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేయరాదు.

3. తమ జనాభా కంటే ఎక్కువ టీకాలు సేకరిస్తున్న రాష్ట్రాలతో కేంద్రం మాట్లాడాలి. ఇలాంటి చర్యలను నిరాకరించాలి.

4. భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి విదేశీ వ్యాక్సిన్‌ కంపెనీలను అనుమతించాలి.

(చదవండి: Rahul Gandhi: మోదీది మొసలికన్నీరు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు