బీజేపీ ‘డబుల్‌ ఇంజిన్‌’ పాతదైపోయింది.. కొత్త ఇంజిన్‌ కావాలి: కేజ్రీవాల్‌

17 Oct, 2022 11:19 IST|Sakshi

గాంధీనగర్‌: ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. డబుల్‌ ఇంజిన్‌ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది బీజేపీ. డబుల్‌ ఇంజిన్‌ ద్వారా అభివృద్ధి రెండింతలు వేగవంతమవుతుందని ప్రచారం చేస్తుంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ‘డబుల్‌ ఇంజిన్‌’ నినాదంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌. గుజరాత్‌కు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అవసరం లేదని, ఇప్పుడు కొత్త ఇంజిన్‌ కలిగిన ప్రభుత్వం కావాలని పేర్కొన్నారు.

గుజరాత్‌లోని భవ్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘వారు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కావాలంటూ మాట్లాడారు. కానీ, ఈసారి గుజరాత్‌కు డబుల్‌ ఇంజిన్ అవసరం లేదు. కొత్త ఇంజిన్‌ కావాలి. డబుల్‌ ఇంజిన్‌ చాలా పాతది. రెండు ఇంజిన్లు 40-50 ఏళ్ల నాటివి. ఒక కొత్త పార్టీ, కొత్త ముఖాలు, కొత్త భావజాలం, కొత్త శక్తి, కొత్త పాలన కావాలి. కొత్త పార్టీ కోసం పాటుపడండి. మీరు ఏదీ కోల్పోరు.’ ‍అని పేర్కొన్నారు కేజ్రీవాల్‌. రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్‌ వెళ్లిన కేజ్రీవాల్‌.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఒకసారి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి వారికి 70 ఏళ్లుగా అవకాశం ఇస్తున్నారని, తనకు ఓ ఛాన్స్‌ ఇచ్చి చూడాలని విన్నవించారు. అనుకున్న రాతిలో పని చేయకపోతే.. మరోమారు ఓట్ల కోసం రానని ప్రతిజ్ఞ చేశారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే తప్పుడు కేసులను కొట్టివేస్తామని హామీ ఇచ్చారు. 

ఇదీ చదవండి: నరబలి కేసు: పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్న ‘మిస్సింగ్‌’ మహిళల బంధువులు!

మరిన్ని వార్తలు