కర్ణాటకలో ఒక్క ఛాన్సివ్వండి: కేజ్రీవాల్‌

5 Mar, 2023 05:00 IST|Sakshi

దావణగెరె: అవినీతి రహిత పాలన అందించే ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఒక్క అవకాశమివ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కర్ణాటక ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య, విద్యుత్తు, ప్రభుత్వ పాఠశాలలు, మంచి ఆరోగ్య వసతులు ప్రజలకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని మార్చేందుకు అవకాశమివ్వాలని కోరారు. శనివారం దావణగెరెలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.

అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని, పంజాబ్‌లోని తమ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేను, ఒక మంత్రిని అవినీతి ఆరోపణలపై జైలుకు పంపించిందని చెప్పారు. రాష్ట్రంలో 40% కమీషన్‌ ప్రభుత్వం పనిచేస్తోందంటూ బీజేపీ పాలనపై విరుచుకుపడ్డారు. మళ్లీ అధికారమిస్తే అవినీతి లేకుండా చేస్తామంటున్న హోం మంత్రి అమిత్‌ షా.. తన నాలుగేళ్లలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.

లోకాయుక్త అధికారులు రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకోవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ ఎమ్మెల్యేను, అతడి కుమారుడిని అరెస్ట్‌ చేయలేదు. కానీ, ఢిల్లీలో మా నేత సిసోడియాను అరెస్ట్‌ చేశారు’అంటూ బీజేపీ తీరుపై మండిపడ్డారు. కర్ణాటకలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో అవినీతి కూడా రెట్టింపయ్యిందని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు