Bird Flu Scare: 12 వేల బాతులను చంపేశారు!

11 Dec, 2021 17:03 IST|Sakshi

కేరళను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ

అలప్పుజ జిల్లాలో అలర్ట్‌

బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో ఆంక్షలు

అలప్పుజ: కేరళ వాసులను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. అలప్పుజ జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తకళి ​​గ్రామపంచాయతీలోని 10వ వార్డులో మొత్తం 12,000 బాతులను చంపేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి బర్డ్ ఫ్లూ నిర్ధారణ పరీక్షల కోసం భోపాల్‌కు పంపించారు. మరోవైపు అలపుజ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. బర్డ్ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు ముమ్మరం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. 


తకళి గ్రామ పంచాయతీలోని వార్డు నంబర్ 10లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో  ఈ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా వైద్యాధికారులు ప్రకటించారు. ఇక్కడ వాహనాలు, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో బాతులు, కోళ్లు, పిట్టలు, పెంపుడు పక్షుల గుడ్లు, మాంసం అమ్మకాలు, పేడ వాడకంపై జిల్లా యంత్రాంగం నిషేధించింది. చంపకుళం, నేడుముడి, ముత్తార్, వీయపురం, కరువట్ట, త్రిక్కున్నపుళ, తకళి, పురక్కాడ్, అంబలపుజ సౌత్, అంబలపుజ నార్త్, ఎడత్వ పంచాయతీలు, హరిప్పాడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. (Omicron Variant: తీవ్రతపై త్వరలో స్పష్టత!)


తకళి పంచాయతీ 10వ వార్డులో కిలోమీటరు పరిధిలో పక్షులను చంపే ప్రక్రియను పూర్తి చేసి సురక్షితంగా పాతిపెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సహకారం అందించాలని, ఆ ప్రాంతంలో నిఘా పెట్టాలని స్థానిక పోలీసులను కోరారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారిత ప్రాంతాల్లో పశుసంక్షేమ శాఖ.. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల ద్వారా ప్రజలకు నివారణ మందులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదికలు అందజేయాలని పశుసంవర్థక శాఖను కలెక్టర్ ఆదేశించారు. (చదవండి: ఒమిక్రాన్‌ టెన్షన్‌.. 2 రోజుల పాటు కర్ఫ్యూ)

>
మరిన్ని వార్తలు