వైర‌ల్: కుర్రకారుకి ఏ మాత్రం తీసిపోవ‌డం లేదుగా

8 May, 2021 20:55 IST|Sakshi

వైర‌ల‌వుతోన్న కేర‌ళ దంప‌తుల ఫోటోషూట్‌

తిరువ‌నంత‌పురం: ఫోటో మ‌నిషి జీవితంలో అంద‌మైన జ్ఞాప‌కాల‌ను, అనుభూతుల‌ను బంధిస్తుంది. మన జీవితంలోని అపూరుప‌మైన క్ష‌ణాల‌ను ఫోటోతో బంధించి.. కాలానికి క‌ళ్లెం వేస్తాం. ఇక ఈ మ‌ధ్య కాలంలో వివాహ వేడుక‌ల్లో ఫోటో షూట్‌ల‌కు చాలా ప్ర‌ధాన్య‌త పెరిగింది. ముఖ్యంగా ప్రీ వెడ్ షూట్‌కు విప‌రీత‌మైన క్రేజ్ పెరిగింది. అయితే వీటిని కూడా భ్ర‌ష్టుప‌ట్టించిన వారున్నారు. అస‌భ్య‌క‌రమైన ఫోటోషూట్ చేసి.. విప‌రీతంగా ట్రోలింగ్‌కు గురైన‌వారున్నారు. దీని గురించి ప‌క్క‌న పెడితే తాజాగా ఓ జంట‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

జీవితాన్ని సంతోషంగా ఎలా మ‌లుచుకోవాలో.. ఉన్న‌దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవ‌డం ఎలానో మీ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజ‌నులు. మ‌రి కొంద‌రు కుర్ర‌కారుకు ఏ మాత్రం తీసిపోవ‌డం లేదు క‌దా.. వ్వాటే రొమాంటిక్ క‌పుల్ అంటూ ప్ర‌శంసిస్తున్నారు. ఆ వివ‌రాలు.. కేర‌ళ‌ కోజికోడ్‌కు చెందిన హ‌రిదాస‌న్(65), కృష్ణ‌వేణి(58) దంప‌తుల‌కు దాదాపు 30 ఏళ్ల క్రిత‌మే వివాహం అయ్యింది. వీరికి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు. ఆ అమ్మాయిలిద్ద‌రికి వివాహాలు కాగా, దుబాయిలో సెటిల‌య్యారు. హ‌రిదాస‌న్ షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. కృష్ణ‌వేణి గృహిణి.

బిడ్డ‌లు ఇద్ద‌రు దుబాయ్‌లో ఉండ‌గా.. ఇక దంప‌తులిద్ద‌రే కోజికోడ్‌లో ఉంటున్నారు. క‌రోనా కార‌ణంగా ఇంటికే ప‌రిమితం అయ్యారు. దాదాపు ఏడాది పాటుగా ఇంటికే ప‌రిమితం అవ్వ‌డంతో లైఫ్ రోటిన్‌గా సాగిపోతున్న‌ట్లు ఫీల‌వ్వ‌సాగారు. ఎక్క‌డికైనా టూర్ వెళ్దాం అంటే కుద‌ర‌ని ప‌రిస్థితి. దాంతో ఈ జంట కాస్త వెరైటీగా ఆలోచించి ఫోటోషూట్ చేయించుకోవాల‌ని భావించారు. దాంతో త‌మ‌కు బంధువైన ఫోటోగ్రాఫ‌ర్ రాకేశ్‌ను పిలిపించుకుని చెట్టికులం బ‌జార్ బీచ్‌లో వాలిపోయారు.

ఇక ఆ ఫోటోషూట్‌లో ఈ జంట‌ న‌వ దంప‌తుల్లా మారిపోయారు. నూత‌న వ‌ధూవ‌రుల ప్రీవెడ్డింగ్ షూట్‌కు ఏ మాత్రం తీసిపోకుండా త‌మ ఫోటోషూట్‌ను అద‌ర‌గొట్టారు. హ‌రిదాస‌న్ తెలుపు రంగు దుస్తుల్లో, కృష్ణ‌వేణి గోధుమ రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. క‌ల్లు తాగుతూ ఎంజాయ్ చేశారు. కృష్ణ‌వేణి బీచ్‌లో కూర్చొని ఉండ‌గా, ఆయ‌న ముంత‌తో క‌ల్లు పోస్తూ ఫోటోల‌కు పోజులు ఇచ్చారు. ప్ర‌స్తుతం వీరి ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

చ‌ద‌వండి: స్త్రీల దుస్తులకూ వయసుంటుందా?
 

మరిన్ని వార్తలు