Kerala: ఉన్నదంతా విరాళంగా ఇచ్చేసిన బీడీ కార్మికుడు!

26 Apr, 2021 14:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా కరోనా సునామీని సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ దీని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది ఉపాధిని సైతం కోల్పోయారు. మరికొందరు పొట్టకూటి కోసం చిన్నాచితకా పనులు చేస్తూ బతుకు బండిని లాగిస్తున్నారు. అయితే, ఇక్కడో వ్యక్తి.. తాను చేసేది చిన్న పనే అయినా.. సీఎం సహయ నిధికి పెద్ద మొత్తంలో విరాళం పంపి గొప్ప మనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కన్నూర్‌కు చెందిన ఓ బీడీ కార్మికుడు కేరళ సీఎం సహాయ నిధికి రూ.2 లక్షలు పంపించాడు. తన సొమ్మును వ్యాక్సిన్‌ తయారీకి ఉపయోగించాలని కోరాడు. ఇలా డబ్బులు పంపిన తర్వాత అతని అకౌంట్లో కేవలం రూ.850 మాత్రమే మిగిలి ఉండటం గమనార్హం.

అయితే, బీడీకార్మికుడు బ్యాంక్‌ అధికారుల దగ్గరకు వెళ్లి తన అకౌంట్‌లోని రూ.2 లక్షలను సీఎం సహయ నిధికి బదిలీ చేయాలని కోరగానే బ్యాంకు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. నీ అకౌంట్‌లో తక్కువ మొత్తంలో డబ్బు ఉందని తెలిపారు.  దాన్ని కూడా విరాళంగా ఇచ్చేస్తే ఎలా జీవనం సాగిస్తావని ప్రశ్నించారు. దీనికి అతను.. ఇక మీదటకూడా బీడీలు చుట్టి బతుకుతానని తెలిపాడు. కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ బీడీవర్కర్‌ ఉదార స్వభావాన్నిసోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడిది వైరల్‌గా మారింది. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. బీడి కార్మికుడి ఉదార స్వభావాన్ని మెచ్చకున్నారు. నెటిజన్లు సైతం ‘మీ మానవత్వానికి హ్యట్సాఫ్‌.‌.. మీరు చాలా మందికి ఆదర్శం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు