జాతీయ జెండా ఉల్టా పల్టా.. కేరళ బీజేపీ చీఫ్‌పై కేసు నమోదు, వీడియో వైరల్‌

16 Aug, 2021 11:22 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. ప్రస్తుతం ఈ సంఘటన రాజకీయంగా కలకలంగా మారింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్నిపురస్కరించుకుని కేరళ బీజేపీ చీఫ్‌ కె. సురేంద్రన్‌ తమ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అయితే, సరైన అవగాహన లేకుండా తలకిందులుగా ఉన్న జెండాను అలాగే ఎగురవేశారు.

కాసేపటికి దీన్ని గమనించిన అక్కడి నేతలు తిరిగి జెండాను సరిచేసి ఎగురవేశారు. అప్పటికే పలువురు స్థానికులు దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ క్లిప్పింగ్‌లు కాస్త వైరల్‌ కావడంతో పోలీసులు సదరు బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేశారు. అదే విధంగా, మొదటిసారి కేరళలో సీపీఐ (యం) పార్టీ ఆఫీస్‌లో నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి వివాదంలో చిక్కుకున్నారు. 

జాతీయ జెండాకు సమానంగా.. తమ పార్టీ జెండాను ఎగురవేశారు. జెండా కోడ్‌ ప్రకారం.. జాతీయ జెండాకు సమానంగా వేరే ఏ పతాకాలు ఉండకూడదు. దీన్ని సీపీఐ (యం) ఉల్లంఘించిందని, దేశ త్రివర్ణపతాకాన్ని అవమానించారని కాంగ్రెస్‌నేత కె.ఎస్‌. సబరినాథన్‌ విమర్శించారు. దీనిపై స్థానిక బీజేపీ నాయకులు కూడా స్పందించారు. వెంటనే సీపీఐ (యం) నాయకులపై జెండాకోడ్‌ ఉల్లంఘన కింద కేసులను నమోదు చేయాలని పోలీసులను కోరారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు